తొమ్మిది తలలు.. రక్తమంతా విషమయం.. దడ పుట్టించే రూపం..ఈ భయంకర జీవేంటో తెలుసా? గ్రీకు పురాణాల్లోని ఓ పాము!
హిందూ పురాణాల్లో వెయ్యి తలల ఆదిశేషుడు ఉంటే, గ్రీకు పురాణాల్లో తొమ్మిది తలల హైడ్రా ఉంది. అయితే ఆదిశేషుడులా అది దేవత కాదు,పరమ కర్కోటకమైన రాకాసి. దీని ఒంట్లోని రక్తం, వదిలే వూపిరి అంతా విషమే. రామాయణంలో రావణాసురుడి తలని నరికితే కొత్తది వచ్చినట్టే, దీని తల నరికితే రెండు పుట్టుకొస్తాయి.
ఇంతకీ హైడ్రా తల్లిదండ్రులు ఎవరో తెలుసా? తల్లి ఎకిడ్నాది పాము శరీరం, మనిషి తల అయితే, తండ్రి టైఫూన్ చూపులతోనే మంటలు చిమ్మే వందతలల భారీ కాయుడు. వీరిద్దరికీ పుట్టిన హైడ్రా భయంకరంగా కాక ఇంకెలా ఉంటుంది? ఇది గ్రీసు దగ్గరి లెర్నా సరస్సులో కాపురం పెడుతుంది. భాగవతంలో కాళీయుడనే నాలుగు తలల పాము ద్వారక దగ్గర సరస్సులో మకాం పెట్టిన కథ గుర్తుందా? దాని వల్ల అక్కడి జలమంతా విషమయమైతే, గ్రీసు దగ్గర హైడ్రా పైకొచ్చి చుట్టుపక్కల పశువుల్ని, మనుషుల్ని చంపి ఆరగిస్తూ ఉంటుంది. మరి దీని పీడ విరగడ చేసిన వాడే లేడా? ఉన్నాడు. అతడే హెర్క్యులస్. దేవతలు అప్పగించిన 12 గొప్ప కార్యాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా మహావీరుడిగా పేరు పొందిన ఇతగాడు హైడ్రాను వెతుక్కుంటూ బయల్దేరతాడు. బిలంలోకి బాణాలు వేసి రెచ్చగొట్టేసరికి హైడ్రా బుసలు కొడుతూ బయటకి వస్తుంది. దాని వూపిరి పీల్చకూడదు కాబట్టి హెర్య్కులస్ ముక్కుకి గుడ్డ కట్టుకుని తలపడతాడు. ఆ యుద్ధం భలే సాగుతుంది. మరి ఒక తల నరుకుతుంటే రెండు పుట్టుకొస్తుంటే ఎలా? దానికీ గ్రీకువీరుడు ఉపాయం ఆలోచించాడు. ఓ తల నరగ్గానే దాని మొదలును కాగడాతో కాల్చే ఏర్పాటు చేశాడు. ఆఖరికి ఒకే ఒక్క తల మిగిలితే దాని దవడలు పట్టుకుని నిలువునా చీల్చి చంపేస్తాడు. ఆపై భూమిలో కప్పెట్టి పెద్ద బండరాయి పడేసి చేతులు దులపుకుని చక్కా వస్తాడు.
హైడ్రా మీద దేశదేశాల్లో బోలెడు కథల పుస్తకాలున్నాయి. అమెరికాలోని అలెన్‌టౌన్‌లోని ఓ పార్కులోని రోలర్‌కోస్టర్‌ని తొమ్మిది తలలతో రూపొందించి దీని పేరే పెట్టారు. ఎందుకో తెలుసా? హెర్క్యూలస్ హైడ్రాతో పోరాడింది అక్కడేట మరి. ఇక దీని పేరుమీద వీడియోగేమ్స్ కూడా ఉన్నాయి. మీరే హెర్క్యులస్‌గా మారి దీనితో పోరాడవచ్చు. దీనిపై టీవీ సీరియళ్లు, సినిమాలు కూడా బోలెడు.
- =========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...