ప్రశ్న: ఎత్తయిన ప్రదేశంలో నిలబడి చుట్టూ చూస్తే చాలా దూరంలో భూమి, ఆకాశం కలిసిపోయినట్లు కనిపిస్తాయి. ఎటు చూసినా అలాగే ఉంటుంది. అవి నిజంగా కలుస్తాయా?
జవాబు: భూమ్యాకాశాలు ఎక్కడా కలవవు. ఎందుకంటే భూమి అనే వస్తువు వాస్తవమే అయినా, ఆకాశమనేది వస్తువూ కాదు, వాస్తవమూ కాదు. మన కంటికి తోచే ఖాళీ ప్రదేశమే ఆకాశం. కేవలం భూమి మీదున్న వాతావరణం వల్లనే ఆకాశం నీలం రంగులో కనిపిస్తుందే కాని, ఆ పరిధి దాటి పైకి వెళితే కనిపించేదంతా కటిక చీకటి లాంటి అంతరిక్షమే. నక్షత్రాలు కనిపిస్తాయి కానీ మిణుకుమనవు. సూర్యుడు ప్రచండమైన కాంతితో గుండ్రంగా గీత గీసినట్టు కనిపిస్తాడు. రేఖల్లాగా మెరుపులు కనిపించవు. భూమి గుండ్రంగా ఉండడం వల్ల, మన కంటికి పారలాక్స్ అనే దోషం ఉండడం వల్ల భూమ్యాకాశాలు కలిసిపోయినట్లు అనిపిస్తుంది. దగ్గరగా చూస్తే వెడల్పుగా ఉండే రైలు పట్టాలు దూరానికి కలిసిపోయినట్టు అనిపించినట్టే ఇది కూడా. గోళాకారంలో ఉండే భూమి ఒంపు వల్ల ఈ భ్రమ (illusion)కలుగుతుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్;రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...