Showing posts with label తిరుమల గిరులు. Show all posts
Showing posts with label తిరుమల గిరులు. Show all posts

Tuesday, May 15, 2012

సప్తగిరులు,ఏడు కొండలు,తిరుమల గిరులు ,Saptagirulu, Seven hills,Tirumala girulu.


  • image : courtesy with Wikipedia.org/

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : తిరుమలకు ఏడుకొండలు లేదా సప్తగిరులు అని పేరు ఎలా వచ్చింది?.

జ : తిరుమల లో ఉండే ఏడుకొండలనే సప్తగిరులని కూడ అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. ఆ ఏడు శిఖరాలకు ... ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర.

* 1 శేషాద్రి
* 2 నీలాద్రి
* 3 గరుడాద్రి
* 4 అంజనాద్రి
* 5 వృషభాద్రి
* 6 నారాయణాద్రి
* 7 వేంకటాద్రి

శేషాద్రి :
  • సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారిమధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏంచేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖీ నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.

నీలాద్రి :
  • స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి 'నీలాద్రి'గా నామకరణం చేశారు. తలనీలాలు అనే మాట కూడా ఆమెపేరు మీద రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు.

గరుడాద్రి :
  • దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు)ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.

అంజనాద్రి :
  • వానరప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్లతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడనీ అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందనీ అంటారు.

వృషభాద్రి :
  • కృతయుగంలో... తిరుమలలోని తుంబురుతీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలంపాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషభాద్రి అనీ పురాణగాథ.

నారాయణాద్రి :
  • విష్ణుదర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణమహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు.

వేంకటాద్రి :
  • కలియుగదైవం వెలసిన తిరుమల గిరి... అలవైకుంఠం నుంచి గరుడుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. 'వేం' అంటే పాపాలు అని, 'కట' అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్రగిరిని 'వేంకటాద్రి' అంటారని ప్రతీతి.దీనికి సంబంధించి జనబాహుళ్యంలో ఓ కథ విస్తృత ప్రచారంలో ఉంది. శ్రీకాళహస్తిలో నివసించే పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఓ కొడుకు పుడతాడు. అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారా దంపతులు. మాధవుడు మాత్రం చెడుసావాసాలు పట్టి అన్నీ పాపాలే చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితోపాటు స్వామిదర్శనానికి వెళతాడు. దర్శనం కోసం స్వామి ఎదుట నుంచున్న మాధవుడికి ఒళ్లంతా మంటలు పుట్టడం మొదలవుతుంది. ఉపశమనం కోసం కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గుతాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలూ నశించాయట. ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు. అతడే మరుజన్మలో తొండమాన్‌చక్రవర్తిగా పుట్టాడని, స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకం.
  • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-