Showing posts with label Animals donot get diseases?- జంతువులకు శుభ్రత అవసరం లేదా?. Show all posts
Showing posts with label Animals donot get diseases?- జంతువులకు శుభ్రత అవసరం లేదా?. Show all posts

Friday, October 17, 2014

జంతువులకు శుభ్రత అవసరం లేదా?,మట్టిలో ఉన్న ఆహార పదార్థాల్ని తింటున్నజంతువులకు జబ్బులేమీ రావా?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: మనం భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతారు కదా! కానీ జంతువులు మాత్రం నేల మీద మురికిలోను, మట్టిలో ఉన్న ఆహార పదార్థాల్ని తింటుంటాయి. మరి వాటికేం కాదా?

జవాబు: ఈ భూమి ఏర్పడ్డ కొన్ని కోట్ల సంవత్సరాలకు భూమి మీద జీవ లక్షణాలున్న కణాలు ఏర్పడ్డాయి. అవే వైరస్‌లు, బ్యాక్టీరియాలుగా రూపొందాయి. జీవ కణం ఆధారం లేకుంటే వైరస్‌లు ఏమీ వృద్ధి చెందలేవు కాబట్టి అవి బ్యాక్టీరియా కణాల్ని కూడా కబళిస్తాయి. ఈ విధంగా ప్రపంచంలో వైరస్‌లు లేని ప్రాణి లేదు. వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పాటు మన పరిసరాలలో మనకు వ్యాధుల్ని కలిగించే ఏకకణ జీవులు, బహుకణ జీవులు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధాన సమస్య బ్యాక్టీరియాలే.

భూమ్మీద ప్రతీ గ్రాము మట్టిలో సగటున నాలుగు కోట్ల బ్యాక్టీరియాలు, శుభ్రమైన తాగే నీటిలో ప్రతి పది మిల్లీ లీటర్లకు కోటి చొప్పున బ్యాక్టీరియాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జంతు, వృక్షజాతుల జనాభాకన్నా బ్యాక్టీరియాలే అధికం. ప్రతీ మనిషిలోనూ సుమారు 10లక్షల కోట్ల మానవజీవ కణాలు ఉండగా, ప్రతి వ్యక్తి శరీరంమీద ఉండే బ్యాక్టీరియాల సంఖ్య వాటికి పదిరెట్లు ఎక్కువ. ఇందులో కొన్ని మనకు సహకరించేవి. మరికొన్ని హాని కలిగించేవి. హాని కలిగించేవి కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. మనం బతికున్నంత కాలం శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ వీటిమీద సైన్యంలా దాడిచేస్తూ మనల్ని కాపాడుతుంది. బ్యాక్టీరియాల సంఖ్య ఈ మోతాదుకు మించితే అనారోగ్యం కలుగుతుంది.

మనం చేతులు కడుక్కోవడం అంటే బయటి బ్యాక్టీరియాను తొలగించుకోవడమే. జంతువుల్లో కూడా వాటివాటి రక్షణ వ్యవస్థ ఉంటుంది. అవి మురికిలోనూ మలిన ప్రాంతాల్లోనూ బతికే పరిస్థితి సహజంగా ఉండడం వలన పరిణామ క్రమంలో వాటికున్న రక్షణ వ్యవస్థ మనకన్నా సమర్థంగా ఉంటుంది. పైగా వాటి శరీర నిర్మాణంలో ఉన్న తేడాలు కూడా జంతువులకు అదనపు రక్షణ వ్యవస్థను సమకూరుస్తాయి. అయితే మురికి, మలినాలు ఎక్కువైతే జంతువులు కూడా రోగాల బారిన పడక తప్పదు.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =================================