Showing posts with label పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?. Show all posts
Showing posts with label పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?. Show all posts

Tuesday, September 29, 2015

పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  



ప్రశ్న: పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?

జవాబు: పిడుగు అనేది రెండు వేర్వేరు ధ్రువత్వం గల విద్యుదావేశాలతో నిండుకున్న మేఘాల మధ్య జరిగే విద్యుదుత్సర్గం. ఒక వేళ ఒక మేఘానికి దగ్గర్లో మరో మేఘం లేనట్లయితే మేఘంలో ఏ ధ్రువత్వం గల విద్యుదావేశం పోగు పడిందన్న విషయంలో సంబంధం లేకుండా ఆ స్థిర విద్యుత్తు భూమి వైపు ప్రసరిస్తుంది. ఆ సమయంలో మేఘానికి దగ్గరగా ఎవరున్నా (చెట్లు, భవనం, విద్యుత్సంభం, వ్యవసాయదారుడు లేదా దారిన పోయే దానయ్య, పశువు) వారు విద్యుత్ప్రవాహి అయినట్లయితే వారి గుండా ఈ అధిక విద్యుత్తు ప్రవహించి మరణానికి దారి తీస్తుంది.

ఈ విపత్పరిణామాన్నే మనం పిడుగు పాటు అంటాం. పిడుగు పడే సమయంలో విద్యుత్తు ఉన్న మేఘానికి, భూమికి మధ్య కొన్ని లక్షల వోల్టుల విద్యుత్తు పొటన్షియల్‌ ఉంటుంది. ఈ విద్యుదుత్సర్గం లిప్తపాటు మాత్రమే ఉంటుంది. అదే పనిగా గంటల తరబడి కొనసాగదు. అంత తక్కువ వ్యవధిలో అంత అధిక మోతాదులో ఉన్న విద్యుత్తును నిల్వ చేయగల పరికరాలు, సాధనాలు లేవు. ప్రవహించే విద్యుత్తును దాచుకొని ఆ తర్వాత వాడుకోగలిగిన వ్యవస్థలు భౌతికంగా కెపాసిటర్లు, రసాయనికంగా ఛార్జబుల్‌ బ్యాటరీలు మాత్రమే! కానీ పిడుగు పడే సమయంలో వాటిని పిడుగు మార్గంలో ఉంచితే అవి కాలిపోవడం మినహా విద్యుత్తు నిల్వ ఉండటం దాదాపు అసంభవం.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-