ప్రశ్న:
సూర్యుడు, గ్రహాలు, భూమి, నక్షత్రాలు అన్నీ గుండ్రంగానే ఉంటాయెందుకని?
-సిహెచ్. హేమ, 9వ తరగతి, పాల్వంచ
జవాబు:
నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడిన తొలి దశలో అవన్నీ కొంతవరకు ద్రవరూపంలోనే, అత్యంత ఉష్ణోగ్రతలతో ఉండేవి. ఆపై క్రమేణా చల్లబడి కొన్ని గ్రహాలు ఘనరూపం దాల్చగా, నక్షత్రాలు ఇంకా చాలావరకూ ద్రవ, వాయు రూపంలోనే ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాలలో ఉండే గురుత్వాకర్షణ శక్తి వాటి కేంద్రాల నుంచి ఉత్పన్నమవడంతో వాటిలోని వివిధ కణాలు వాటి కేంద్రాల వైపు ఆకర్షితమవుతాయి. ఉష్ణోగ్రతలు తగ్గి చల్లబడిన తర్వాత కూడా అంతర్భాగాలలో విచ్ఛిన్నమవుతున్న రేడియో ధార్మిక మూలకాల వల్ల గ్రహాల లోనూ, కేంద్రక సంయోగం (న్యూక్లియర్ ఫ్యూజన్) వల్ల నక్షత్రాల లోను ఉష్ణం పుడుతూనే ఉంది. అందువల్ల గ్రహాల అంతర్భాగంలోని పదార్థాలు, నక్షత్రాల లోని పదార్థాలు ఇప్పటికీ ద్రవరూపంలోనే ఉన్నాయి. ఈ పదార్థాలు కూడా గురుత్వాకర్షణ వల్ల వాటి కేంద్రాల వైపే ఆకర్షితమవుతూ ఉంటాయి. ఈ ఆకర్షణ అన్ని భాగాలపైనా ఒకే విధంగా ఉండడం వల్ల నక్షత్రాలు, గ్రహాలు గోళాకార రూపం దాల్చాయి. గణిత భావనల ప్రకారం ఆదర్శవంతమైన సౌష్ఠవరూపం గోళాకారమే.
Courtesy:Eenadu telugu daily-ప్రొ||ఈ.వి.సుబ్బారావు
- ====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...