Wednesday, July 07, 2010

వాసనలు ఎలా తెలుసుకుంటాము ? , Smelling of different substances - How?




ప్రశ్న:
ముక్కుతో గాలి పీల్చుకున్నప్పుడు వివిధ రకాలైన వాసనలను ఎలా పసిగడతాము?

జవాబు:
ముక్కుతో మనం లెక్కలేనన్ని రకాలైన వాసనలను పసిగడతాము. కానీ ముక్కులో వీటిని గ్రహించే గ్రాహకాల సంఖ్య 400 మాత్రమే. వీటిలో వాసనకు సంబంధించిన అణువులను గ్రహించే ప్రొటీన్లు ఉంటాయి. ఈ గ్రాహకాల్లో రోజా పువ్వు పరిమళాన్ని పసిగట్టేవని, సంపెంగ వాసనను గ్రహించేవని వేర్వేరుగా ఉండవు. తక్కువ సంఖ్యలో ఉన్న గ్రాహకాలు అన్ని రకాలైన వాసనలను పసిగట్టడానికి కారణం ముక్కులో ఉండే నాడీ సంబంధిత కణాలు. ఒక కణం ఎన్నో వాసనలకు స్పందించినప్పటికీ అది పసిగట్టే వాసనల తీవ్రతలో తేడా ఉంటుంది. ఏ ఏ కణాలు ప్రత్యేకంగా స్పందించాయి, ఆ స్పందన తీవ్రత ఎంత అనే విషయాలపై ఆధారపడి వాసనకు సంబంధించిన అవగాహన మనకు కలుగుతుంది. ఉదాహరణకు ఒక గులాబీని వాసన చూస్తే, ముక్కులో ఒక తెగకు చెందిన కణాల సముదాయమే ప్రేరేపితమవుతుంది. ఆ కణాలు పంపిన సంకేతాలు మెదడు ముందు భాగంలో ఉబ్బెత్తుగా బొడిపెలాగా ఉండే ఘాణేంద్రియ సంబంధిత ప్రదేశానికి చేరుకుంటాయి. ఈ సంకేతాల కలయిక ద్వారా మెదడుకు ఆ వాసన గులాబీదనే విషయం తెలుస్తుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయంపై ఇప్పుడు శాస్త్రవేత్తలు బ్రెయిన్‌ స్కానింగ్‌ పద్ధతి ద్వారా పరిశోధనలు జరుపుతున్నారు.
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...