Thursday, July 15, 2010

వర్షం అక్కడక్కడా కురుస్తుంది ఎందుకని? , Rain falls here and there-Why?







వర్షించాలంటే మేఘాలు అవసరం. వర్షించే మేఘాలు ఏర్పడాలంటే గాలిలో పెద్దఎత్తున తేమ అవసరం. సముద్రంలో విస్తారంగా ఉన్న ఉపరితల నీరు ఆవిరై పైకి పోతుంది. ఇలా ఆవిరి పైకిపోతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతి 100 మీటర్లకు సుమారుగా ఒక సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. అందువల్ల, ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుండటంతో పైకి వెళ్లిన నీటిఆవిరి ఆకాశంలోని ధూళి కణాల చుట్టూ చేరి, ఘనీభవిస్తుంది. ఇవి సమూహాంగా ఉంటాయి. ఈ ఘనీభవించిన నీరు, ధూళి, గాలి అన్నీ కలిపి సమూహంగా భూమి మీద మనకు మేఘంగా కనిపిస్తుంది.

గాలి వేడిగా ఉన్నప్పుడు ఆవిరిని ఎక్కువగా ఉంచు కొనగలుగుతుంది. ఇదే చల్లబడ్డప్పుడు తక్కువ తేమను మాత్రమే ఇముడ్చుకొంటుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు గాలిలో అధికంగా ఉన్న తేమ వర్ష బిందువుల రూపంలో బయటపడతాయి. ఇదే విధంగా గాలితోపాటు పయనిస్తున్న మేఘాలకు ఏదైనా ఎత్తయిన ప్రదేశాలు లేక పర్వతాలు అడ్డుగా వస్తే లేదా ఏ ఇతర కారణాల వల్ల మేఘాలు పైకి పోతే చల్లని వాతావరణాన్ని ఎదు ర్కొంటాయి. ఈ సమయంలో అధికంగా ఉన్న నీటితేమ సూక్ష్మ బిందువుల రూపంలో వేరువేరుగా ఉండక, ఒకదానికొకటి కలసి పెద్ద నీటి బిందువులగా మారిపోతాయి. ఈ నీటి బిందువుల భూమ్యాకర్షణకు లోనై వర్షంగా కురుస్తాయి. ఒకోసారి ఇలా పడేటప్పుడు వాతావరణ గాలి వేడిగా ఉంటే పెద్ద నీటి బిందువులు తిరిగి సూక్ష్మ బిందువులుగా మారిపోతాయి. ఇలా మారని పెద్ద నీటి బిందువులు మాత్రం వర్షం రూపంలో భూమి మీద పడతాయి.

అన్ని మేఘాలూ వర్షించవు..

అన్ని మేఘాలూ వర్షించవని గుర్తుంచుకోవాలి. మన కంటికి కనిపించే ఎత్తయిన తెల్లని మేఘాలు వర్షించవు. బూడిదరంగు మేఘాలే వర్షిస్తాయి. మేఘాలు గాలివాటున పయనిస్తాయి. దట్టమైన అరణ్య ప్రాంతాల్లో, ఎత్తయిన కొండలపైన, గాలిలో తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లో, శీతల ప్రాంతాల్లో నల్లని, బూడిదరంగు మేఘాలు ఏర్పడి, వర్షిస్తాయి. ఒకసారి కురిసిన మేఘాలు వర్షించే తేమను కోల్పోతాయి.

ఋతుపవన కాలంలో సముద్రపు నీరు విస్తృత మేఘాల రూపంలో చల్లగా ఉన్న భూమిపైకి వచ్చి, వర్షిస్తాయి. ఈ వర్షాలు విస్తారంగా ఉంటాయి. సముద్రంలో వాయుగుండం ఏర్పడినప్పుడు తుపాను రూపంలో కూడా ఇలానే మేఘాలు భూమి మీద వర్షిస్తాయి. పయనించే మార్గంలోనే మేఘం వర్షిస్తుంది. ఇతర ప్రాంతాల్లో వర్షించదు.

ఇక ప్రశ్నకు సమాధానం... ఋతు పవనాలు, తుపాను కాలంలోనే కాక మిగతా సమయంలో కూడా మేఘాలు ఏర్పడతాయి. ఇతర సమయాల్లో ఏర్పడిన మేఘాలు స్థానిక నీటి వనరుల నుండి, ఇతరత్రా నీటి ఆవిరిని గ్రహించి, పటిష్ట మవుతాయి. గాలివాటుగా మేఘాలు పయనిస్తాయి. ఎక్కడైతే చల్లటి వాతావరణాన్ని ఎదుర్కొంటాయో అక్కడే మేఘాల్లో అధికంగా నిల్వ ఉన్న తేమ వర్షం రూపంలో భూమి మీద కురుస్తుంది. సామాన్యంగా గ్రామ నివాస ప్రాంతాల్లో చెట్లు అధికంగా ఉంటాయి. బహిరంగ చేలల్లో చెట్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల గ్రామాల్లో అధికంగా ఉన్న చెట్లు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి. కాబట్టి పరిమితంగా ఉన్న మేఘాలు చల్లగా ఉన్న ప్రాంతాల్లో నిలబడి వర్షిస్తాయి. ఇదే సమయంలో చేలల్లో మేఘాలు తక్కువగా వర్షిస్తాయి. ఇవి స్థానిక వర్షాలు. అంటే కేవలం చల్లగా ఉన్న ప్రాంతాల్లో వర్షిస్తూ, మిగతా ప్రాంతాల్లో వర్షించవు. ఒకోసారి స్థానిక వర్షం ప్రారంభమైన తర్వాత పెద్ద జల్లులు ఒకేసారి కురుస్తాయి. విస్తారంగా పడవు.
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...