ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎందుకు?
జవాబు:
ఉల్లిపాయల్లో ఎమినోయాసిడ్‌ను ఉత్పన్నం చేసే భాస్వరం ఉంటుంది. కోసినప్పుడు భాస్వర మూలకం విచ్ఛిన్నం కావడంతో ప్రొపాంథియాల్సో ఆక్సైడ్ (Propanthialso oxide) అనే ద్రవం ఏర్పడుతుంది. ఈ ద్రవానికి అతి త్వరగా ఆవిరిగా మారే ధర్మం ఉంటుంది. అలా మారిన వాయువు కళ్లలోకి జొరబడుతుంది. కళ్లలోకి వెళ్లిన వాయువు అక్కడి తేమతో కలిసి సల్ఫ్యూరికామ్లము, హైడ్రోజన్ సల్ఫైడ్‌గా ద్రవరూపం చెందుతుంది. దాంతో కళ్లు భగ్గుమని మండి కన్నీరు కారుతుంది. ముక్కు నుంచి కూడా నీరు కారుతుంది. చిత్రమేమంటే కన్నీరు తెప్పించే ఈ భాస్వరపు సమ్మేళనమే ఉల్లిపాయలను ఉడికించేప్పుడు వచ్చే కమ్మని వాసనకు కారణం. ఉల్లిపాయలను కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే, తరిగేముందు వాటిని నీటితో కడిగి తడిగా ఉంచాలి. అప్పుడు భాస్వరపు సమ్మేళనం ఆ తడిలో కరిగిపోతుంది.
--ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
----------------------------------------------------------------------------
ఉల్లిపాయలు కోస్తే కన్నీరేల?---ప్రొ.. ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
జవాబు: శాస్త్రీయంగా ఉల్లి పేరు ఎలియం సిపా (allium cepa). మామూలు కంటితో కూడా చూడ్డానికి వీలైన పెద్ద జీవకణాలు ఉల్లిపాయ పొరల్లో ఉంటాయి. కోసినప్పుడు కన్నీళ్లు తెప్పించే పదార్థాలను, కంటిలోకి వాయురూపంలో చేరితే కన్నీళ్లు కలిగించే రసాయనాలనీ 'నేత్ర బాష్పద రకాలు'(lachrymatory agents) అంటారు. ఉల్లిపాయ కణాల్లో గంధక పరమాణువులుండే అమైనో ఆమ్లాలు కొన్ని ఉంటాయి. అందులో అల్లీన్ (allin)ఒకటి. అలాగే అల్లినేస్ (allinese) అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఉల్లిపాయను కోసేటప్పుడు అందులోని కణాలు తెగిపోవడం వల్ల ఇవి బయటపడి గాలిలోని ఆక్సిజన్ సమక్షంలో చర్య జరిగి సల్ఫీనిక్ ఆమ్లాలు ఏర్పడుతాయి. వెంటనే ఇవి ఉల్లిలోని మరో ఎంజైమ్ వల్ల 'ఎస్-ఆక్సైడ్' అనే వాయురూప పదార్థంగా మారుతుంది. ఇది గాలిలో వ్యాపించి కంటిని చేరితే, కంటిలో ఉన్న నాడీ తంత్రులు స్పందించి 'మంట' పుట్టిన భావన కలుగుతుంది. వెంటనే ఆ మంటను నివృత్తి చేయడానికి మెదడు కన్నీటి గ్రంథుల్ని (lachrynatory glands) ప్రేరేపించి కన్నీరు కలిగిస్తుంది.
- ===============================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...