Thursday, July 29, 2010

ఈత రాని చేపలుంటాయా? , Fish can not swim ?




చేప అంటే నీటిలో ఈది తీరాలిగా? కానీ ఈతరాని చేపలున్నాయంటే నమ్ముతారా! అవును 'హాండ్‌ ఫిష్‌లు' ఆ రకమే. ఇవి ఈదలేవు. మరేం చేస్తాయి? సముద్రం అట్టడుగు మట్టంపై చేతులతో నడుస్తాయి. చేపకు మొప్పలుంటాయి కానీ చేతులేంటి? అదే వీటి ప్రత్యేకత. వీటికి మొప్పల స్థానంలో బలమైన కండరాలు పొడుచుకు వచ్చి ఉంటాయి. అచ్చం చిన్న చిన్న చేతుల్లాగా. వాటితో నడుస్తాయి. ఆస్ట్రేలియా సముద్రాల్లో మాత్రమే కనిపించే ఈ నడిచే చేప ఈదలేకపోడానికి కూడా కారణం ఇదే. ఇవి ఇలా నడచుకుంటూ నీటి అడుగున ఉండే క్రస్టసీన్‌లు, చిన్నచిన్న జీవులు కనిపిస్తే గుటుక్కుమనిపిస్తుంటాయి. అందుకే దీనికి 'హాండ్‌ ఫిష్‌' అని పేరొచ్చింది. ఈ మధ్యే వీటిల్లో 9 కొత్త జాతుల్ని కనుగొన్నారు. మొత్తం 14 జాతులున్నాయి.

ఈ చేప ఎంతుంటుందో తెలుసా? నాలుగు అంగుళాలు అంటే 10 సెంటీమీటర్లు. చూడ్డానికి రంగురంగుల్లో భలే అందంగా కనిపించే ఈ చేపల్లో పింక్‌ హాండ్‌ ఫిష్‌ అనే దానిపై ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేసి హడావుడి చేశారు. ఎందుకో తెలుసా? అక్కడి సముద్రాల్లో జీవ వైవిధ్యం బాగా దెబ్బతింటోందిట. అలా ముప్పు పొంచిన ఉన్న జీవుల్లో మొదటి స్థానంలో ఉంది ఈ చేపే మరి.

ఎప్పుడో 11ఏళ్ల క్రితం 1999లో కనిపించిన ఈ జాతికి చెందిన పింక్‌ హాండ్‌ ఫిష్‌ మళ్లీ ఇప్పుటి వరకూ జాడలేకుండా పోయిందంటే ఇవెంత ప్రమాదస్థితిలో ఉన్నాయో అర్థమవుతుంది. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉండేవట. వాతావరణ కాలుష్యం, వేట, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇవి క్రమంగా అంతరించిపోయాయి.

బ్యాట్‌షిఫ్‌ కూడా..
ఇలా నడిచే చేపల జాబితాలో బ్యాట్‌ఫిష్‌లు కూడా ఉన్నాయి. వీటిల్లో రెండు కొత్త జాతుల్ని మెక్సికోలోని సముద్ర
తీరంలో కనుగొన్నారు. మన అరచేతుల్లో ఇమిడేంత పరిమాణంలో ఉండే ఇవి అట్టడుగున సముద్ర తలంపై చకచకా నడిచేస్తాయి. వీటికి దృఢమైన భుజాల్లాంటి మొప్పలు ఉన్నాయి. అదాటున చూస్తే గబ్బిలం నడుస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే వాటికి బ్యాట్‌ఫిష్‌ అని పేరొచ్చింది. గల్ఫ్‌ తీరంలో డీజిల్‌, పెట్రోల్‌ అవశేషాలు సముద్రంలో కలుస్తాయి కదా, వాటి వల్ల ఈ చేపలు చాలా ప్రమాదంలో పడ్డాయి. వీటి ఆహారమైన ప్లాంక్‌టన్‌లు విషపూరితమైపోతున్నాయి. అలాగే వాటి గుడ్లు కూడా పిల్లలవ్వకుండానే చనిపోతున్నాయి.

  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...