Saturday, July 03, 2010

ఎంత వానో తెలిసేదెలా? , Rain measurement-How?




ప్రశ్న: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు?

జవాబు: ఏ ప్రాంతంలోనైనా వర్షం కురిస్తే ఆ ప్రాంతంలోని సమతలంపై నీరు ఎంత ఎత్తుకు చేరుకుంటుందో ఆ మట్టం ఆధారంగా అక్కడ కురిసన వర్షపాతాన్ని కొలుస్తారు. ఉదాహరణకు విజయవాడలో 10 మిల్లీమీటర్ల వర్షం నమోదైందంటే అక్కడి సమతలంపై నిలిచిన నీటి ఎత్తు 10 మి.మీ. అన్నమాట. కానీ ఒక స్థలంలో నీరు ఎంత ఎత్తున నిలబడిందనే విషయాన్ని నేల మీద నుంచి కొలవడం సాధ్యం కాదు. అందువల్ల వర్షపాతాన్ని వర్షమాపకం (Rain Gauge) అనే పరికరంతో కొలుస్తారు.

వర్షమాపకంలో ఫైబర్‌గ్లాస్‌తో కానీ, లోహంతో కానీ చేసిన 10 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక గరాటు (ఫన్నల్‌) ఉంటుంది. ఈ గరాటు ఒక లీటరు ఘనపరిమాణంగల సీసా మూతకు బిగించి ఉంటుంది. గరాటు ద్వారా సీసాలో పడిన వర్షపు నీటి ఘనపరిమాణాన్ని కొలవడానికి ఒక కొలజాడీ (measuring jar)ఉంటుంది. చెట్లు, కొండలు లేని మైదానంలో సమతలంగా ఉన్న నేలపై 30 సెంటీమీటర్ల ఎత్తులో వర్షమాపకాన్ని అమరుస్తారు. ఆ ప్రదేశంలో వర్షం పడినప్పుడు నీరు వర్షమాపకంలోని గరాటు ద్వారా సీసాలో పడి కొంత ఎత్తులో నిలబడుతుంది. అలా సేకరించిన నీటి ఘనపరిమాణాన్ని కొలజాడీలో కొలిచి ఆ ప్రదేశంలోని వర్షపాతాన్ని లెక్కగడతారు.

వాతావరణ పరిశోధన కేంద్రాలలోని వర్షమాపకం ఒక సన్నని గొట్టంలా ఉంటుంది. ఆ గొట్టంపై ముందుగానే పై పద్ధతిని ఉపయోగించి కొలతలు గుర్తించి ఉంటాయి. అందులోకి చేరిన నీటి మట్టాన్ని బట్టి వర్షపాతాన్ని నేరుగా మిల్లీమీటర్లలో కొలుస్తారు.

వర్షాన్ని అలా కొలుస్తారేం?

ప్రశ్న: ద్రవాలను లీటర్లలో కొలుస్తారు కదా, మరి వర్షపాతాన్ని ఎందుకు మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో కొలుస్తారు?

-కేబీటీ సుందరి, సికింద్రాబాద్‌


జవాబు: ఏదైనా భౌతిక రాశి (physical parameter)ని రాసేప్పుడు ఏ ప్రమాణాల్లో (units) రాస్తే సులువుగా ఉంటుందో దాన్నే పాటిస్తారు. సాధారణంగా మెట్రిక్‌ విధానం, బ్రిటిష్‌ విధానం గురించి చదువుకుని ఉంటారు. అంతర్జాతీయంగా మెట్రిక్‌ విధానం (Standard International or SI) అమల్లో ఉంది. దీని ప్రకారం దూరానికి మీటరు, కాలానికి సెకను, ద్రవ్యరాశికి కిలోగ్రాము, విద్యుత్‌ ప్రవాహానికి ఆంపియర్‌ ప్రమాణాలు. కొలతల్ని వీటిలోనే చిన్న, పెద్ద ప్రమాణాలుగా వాడతాము. దూరం విషయంలో మిల్లీమీటరు, కిలోమీటరు ఉన్నట్టన్నమాట. కానీ ఒక పరమాణువు సైజును మీటర్లలోనే రాయాలంటే దాన్ని 0.000000002 మీటర్లు అని రాయాల్సి ఉంటుంది. కానీ మీటరులో బిలియన్‌ (వంద కోట్ల భాగం) వంతును నానోమీటర్‌ అనుకున్నాక, పరమాణువు సైజును 20 నానోమీటర్లు అనడం సులువు. అలాగే సూర్యుడికి, భూమికి మధ్య ఉండే దూరాన్ని మీటర్లలో రాయాలంటే 150000000000 అని రాయాల్సి వస్తుంది. దీనికన్నా 150000000 కిలోమీటర్లు అని రాయడం తేలిక. అయితే సూర్యుడికి, భూమికి ఉన్న దూరాన్ని ఒక ఆస్ట్రనామికల్‌ యూనిట్‌ అనుకుంటే అది ఖగోళ విషయాల్లో సులువుగా ఉంటుంది. ఇక వర్షం ద్రవపదార్థమే అయినా, వర్షపాతాన్ని కొలిచే పరికరాల్లో (రెయిన్‌గేజ్‌) కొలతలు మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో ఉంటాయి కాబట్టి అలా రాస్తారు. ఒక సమతలమైన ప్రదేశంలో వర్షం కురిస్తే, ఎంత ఎత్తున నీరు నిలబడుతుందనే విషయాన్నే ఆ పరికరాలు చెబుతాయి. ఒక మిల్లీమీటరు వాన పడిందంటే అర్థం, ఆ ప్రాంతంలో ప్రతి చదరపు మీటరు వైశాల్యానికి ఒక లీటరు వంతున నీరు చేరిందని అర్థం.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...