మొక్కల్లో మాంసాహారాన్ని తీసుకునేవి ఉంటాయని విన్నాను. నిజమేనా?
-డి.వి. రమణరావు, భీమవరం
జవాబు:
కొన్ని మొక్కల్లో కీటకాలను ఆకర్షించి, బంధించే వ్యవస్థ ఉన్నవి ఉన్నాయి. బంధించిన కీటకాలను ఎంజైములు, బ్యాక్టీరియా సాయంతో జీర్ణించుకునే వీలు వాటిలో ఉంటుంది. ఇలాంటి మొక్కలను మాంసాహారపు మొక్కలు (carnivorous plants) అంటారు.
ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా ఉండే ఇలాంటి మొక్కల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఉదాహరణకు వీనస్ ఫ్త్లెట్రాప్ అనే మొక్క ఆకులు తెరిచిన దోసిలిలాగా అమరి ఉంటాయి. వాటి అంచుల్లో సన్నని వేళ్లలాంటి కాడలు ఉంటాయి. ఆకుల లోపలి గ్రంథులు సువాసనలను వెదజల్లే స్రావాలను విడుదల చేస్తాయి. అందువల్ల ఆకర్షితమైన కీటకాలు ఆకుల మధ్యకు చేరుకోగానే, అంతవరకూ దోసిలిలా ఉండే భాగాలు చటుక్కున మూసుకుపోతాయి. అంచుల్లో ఉండే కాడలు కూడా మనం వేళ్లను బిగించినట్టుగా బిగిసిపోతాయి. దాంతో లోపలి కీటకం ఎటూ తప్పించుకోలేదు. ఆకుల లోపలి భాగంలో స్రవించే ఎంజైములు, ఆమ్లాల వల్ల కీటకం శరీరం విచ్ఛిన్నమై ద్రవరూపంలోకి మారుతుంది. మొక్క దాన్ని శోషించుకుంటుంది. ఇలా దొన్నెల్లాగా, మూతల్లాగా రకరకాల ఆకారాల్లో ఉండే ఈ మాంసాహార మొక్కల్లో కొన్ని చిన్న చిన్న జంతువులను సైతం పట్టి అరాయించుకునే శక్తి కలవి ఉంటాయి.
Courtesy:Eenadu telugu daily-ప్రొ||ఈ.వి.సుబ్బారావు
- ========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...