మనం నడుస్తున్నపుడు చేతులు ఎందుకు వూపుతాము?
-లగుడు కృష్ణ సౌందర్య, 8వ తరగతి, చోద్యం, గోటగొండ
జవాబు:
నడుస్తున్నప్పుడు చేతులూపడమనేది అసంకల్పితంగా జరిగేదే అయినా, దీని వెనుక బ్యాలన్స్‌కి సంబంధించిన సూత్రం ఉంది. ఇది, శరీరం మధ్య భాగాన్ని కదలకుండా ఉంచడానికి, దేహశక్తిని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నడిచేప్పుడు మనపై కొన్ని బలాలు పనిచేస్తుంటాయి. మన శరీరం పైనుంచి కిందికి ఒక నిలువైన అక్షం (axis)ఉన్నట్టు వూహించుకుంటే, కుడికాలును ముందుకు వేసినప్పుడు అక్షంపై ఒక బలం గుండ్రంగా తిరుగుతూ పని చేస్తుంది. దీనిని అపవర్తన భ్రామకం (రొటేషనల్ మొమెంట్) అంటారు. దీని వల్ల నడుం గుండ్రంగా తిరగడానికి ప్రయత్నిస్తుంది. అలా తిరిగితే నియంత్రణ కోల్పోయి పడిపోతాం. ఈ బల ప్రభావాన్ని ఆపాలంటే దీనికి వ్యతిరేక దిశలో మరో బల భ్రామకం పనిచేయాలి. ఇది ఎడమ చేతిని ముందుకు వూపడం వల్ల ఏర్పడుతుంది. అంటే, కుడికాలును ముందుకు వేస్తే ఏర్పడిన బలాన్ని, ఎడమచేతిని ముందుకు ఊపితే ఏర్పడిన బలం 'బ్యాలెన్స్' చేస్తుంది.
కుడికాలును ముందుకు వేసినపుడు కుడిచేతిని, ఎడమకాలును ముందుకు వేసినపుడు ఎడమచేతిని అదే దిశలో వూపి నడవడం సాధ్యంకాదు. అలా చేస్తే మన నడుము, శరీరం పక్కకు ఒరిగిపోయే బలానికి గురవడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. ఇలా పరుగెత్తడానికి ప్రయత్నిస్తే అసలు సాధ్యం కాదు.
- ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...