ప్రశ్న: పాదాలకు పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఎందుకు?
జవాబు: మనం నేల మీద నుంచోడానికి, నడవడానికి సహకరించే పాదాలు ఎప్పుడూ మన భారాన్ని మోస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా వత్తిడికి గురవుతూ ఉంటాయి. పాదాలతో పాటు అర చేతులు కూడా రకరకాల పనులలో సహకరిస్తూ ఉంటాయి. అందువల్ల పాదాల చర్మం (sole), అరచేయి చర్మం (palm) మందంగా ఉంటాయి. మందంగాను, దృఢమైన కండర పొరతోను ఉండడం వల్ల శరీర రక్త ప్రసరణ వ్యవస్థ (blood circulatory system) అరికాళ్లు, అరచేతుల్లో తుదికంటా ఉండదు. కొంత వరకు విస్తరించి తర్వాత ఆగిపోతుంది. అంటే నీటిని, పోషక విలువల్ని పంపిణీ చేసే రక్తనాళికలు అరికాలి చర్మంలో నేలను తాకే చిట్టచివరి పొర వరకు చేరవన్నమాట. నీరులేని పంట పొలాలు బీటలు వారినట్టే నీరు అంతగా లభించని అరికాలి చర్మం కూడా పగుళ్లకు లోనవుతుంది. ఈ స్థితి చలికాలంలో ఎక్కువ. ఎందుకంటే ఆ రుతువులో చర్మంలో రక్తనాళాలు మరింత లోతుల్లో ఉంటాయి. చలికాలంలో చర్మం పాలిపోయినట్టు తెల్లగా ఉండడానికి కారణం కూడా అదే. ప్రతి పూట కాసేపు అరికాళ్లను బకెట్టులోని నీటిలో నానబెట్టి కొంచెం కొబ్బరి నూనె వంటి లేపనాలు పూసుకుంటే అరికాలి పగుళ్లను చాలా మటుకు నివారించవచ్చు. అనవసరంగా సౌందర్య సాధనాలను ఉపయోగించడం డబ్బు వృథా!
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్,-వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...