ప్రశ్న:కోతి నుంచి మనిషి రూపాంతరం చెందాడంటారు. మనిషి కూడా అలా మరో రకమైన జీవిగా మారతాడా?
జవాబు: గొంగళి పురుగు ప్యూపా దశలోకి వెళ్లి అందులోంచి సీతాకోక చిలుకగా మారినట్టు కోతి నుంచి మనిషి ఏర్పడలేదు. అది ఒక జీవి జీవిత చక్రంలో వివిధ దశలు కాగా, ఇది పరిణామ క్రమంలో ఒక భాగం. కోతి లాంటి జీవుల్లో కొన్ని లక్షల సంవత్సరాల విస్తారంలో మార్పులు జరిగి క్రమేపీ మనిషిలాంటి జీవులు పరిణామం (evolution) చెందాయని అంటాము. ప్రకృతిలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునేలా దేహంలో క్రమేపీ మార్పులు చెందేలా సంతానం తర్వాత సంతానం, తరం (generation) తర్వాత మరో తరంలో ఎంతో కొంత మార్పు జరుగుతుంది. ఏ మార్పులైతే ప్రకృతితో తలపడడానికి, మనుగడ సాగించడానికి అనువుగా ఉంటాయో అలా రూపాంతరం చెందిన జీవులే నిలుస్తాయి. అవి లేనివి అంతరిస్తాయి. దీనినే శాస్త్రవేత్త డార్విన్ 'ప్రకృతి వరణం ద్వారా జీవ పరిణామం, జంతువుల ఆవిర్భావం' (Origin of species by evolution and natural selection) అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనిషిలో కూడా మార్పులు జరిగి మరో ఆధునిక రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉంది.
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...