ప్రశ్న: మనం నడిచేప్పుడైనా, రైలులో వెళ్లేప్పుడైనా ఆకాశంలో చంద్రుడు మనతోనే వస్తున్నట్టు కనిపిస్తాడు కదా? ఎందువల్ల?
జవాబు: ఒక వస్తువు మనకు కనిపించాలంటే దానిపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం చెంది మన కంటికి చేరాలి. ఆ వస్తువు నుంచి కాంతి కిరణాలు అన్ని వైపులకూ ప్రసరించినా, మనం చూస్తున్న దిశగా కొంత ప్రాంతానికే పరిమితమై ఉంటాయి. ఆ వస్తువు నుంచి అటూ ఇటూ పయనించే కిరణాలతో ఊహారేఖలు గీస్తే అవి ఒక శంకువు (cone) ఆకారంలో ఉంటాయి. ఆ ఊహా శంకువు శీర్షకోణం వద్ద ఆ వస్తువు ఉంటే, దాని కింద వృత్తాకారంలో ఉండే ప్రాంతం (శంకువు బేస్)లో ఎక్కడో ఒకచోట మనం ఉంటామన్నమాట. అపుడే ఆ వస్తువు మనకి కనిపిస్తుంది. ఆ వస్తువుకి, మనకి ఉన్న దూరాన్ని బట్టి ఊహా శంకువు పరిమాణం ధారపడి ఉంటుంది.
ఇప్పుడు మనం రైలులోనో, బస్సులోనో కిటికీ దగ్గర కూర్చుని బయటి దృశ్యాలను చూస్తున్నామనుకుందాం. ఆ దృశ్యాలకు సంబంధించి రెండు విషయాలను గమనించవచ్చు. మన వాహనానికి దగ్గరగా ఉండే వస్తువులు వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నట్లు అనిపిస్తాయి. ఎందుకంటే ఈ వస్తువుల నుంచి వచ్చే కిరణాలతో ఏర్పడే ఊహా శంకువు బేస్ ప్రాంతం నుంచి మనం వేగంగా ముందుకు వెళ్లిపోతాం కాబట్టి! అదే మనం ఉన్న వాహనానికి దూరంగా ఉండే కొండల్లాంటి వస్తువుల నుంచి వచ్చే కిరణాలతో ఏర్పడే ఊహా శంకువు బేస్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దగ్గరగా ఉండే వస్తువుల కన్నా, దూరంగా ఉండేవి నెమ్మదిగా వెనక్కి వెళుతున్నట్టు అనిపిస్తాయి. అదే ఆకాశంలో చంద్రుడి నుంచి వచ్చే కిరణాలతో ఏర్పడే ఊహాశంకువు బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం నడుస్తున్నా, పరిగెట్టినా, మన వాహనం ఎంత వేగంగా వెళ్లినా, దాని బేస్ ప్రాంతంలోనే ఉంటాం. అందువల్ల చందమామ మనతోనే వస్తున్నట్టు అనిపిస్తుంది. భూమిపై ఎన్నో ప్రాంతాలలోని ప్రజలు ఒకేసారి చందమామను చూడగలగడానికి కూడా ఇదే కారణం.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==============================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...