ప్రశ్న: విద్యుత్ పరికరాల వాడకంలో రెండు వైర్లు బదులు ఒకటే వినియోగించి విద్యుత్ ప్రసారం చేయలేరా?
జవాబు: ఏదైనా విద్యుత్ పరికరం పని చేయాలంటే అందులో కీలకమైన విద్యుత్ వలయం (electrical circuit)లో విద్యుత్ ప్రవాహం జరగాలి. నదిలో నీరు ప్రవహించినట్టే ఆ విద్యుత్ వలయంలో ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి. నదికి నీరు వచ్చే దిశ, వెళ్లే దిశ ఉన్నట్టే విద్యుత్ పరికరానికి ఎలక్ట్రాన్లు చేరే చివర (terminal), ఎలక్ట్రాన్లు పోయే చివర అంటూ రెండు ధ్రువాలు ఉండాలి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒక ధ్రువాన్ని భూమికి కలిపి రెండో ధ్రువాన్ని విద్యుద్వాహినిగా చేస్తారు. భూమికి కలిపిన చివరను న్యూట్రల్‌గాను, విద్యుత్ ప్రవహించే తీగను ఫేజ్ లేదా లైన్ అనే పేరుతోను వ్యవహరిస్తారు. అవే రెండు తీగలు. ప్రతి సారీ మనం ఇళ్లలో గొయ్యి తవ్వి భూమికి ఒక వైరును తగిలించలేము కాబట్టి ఇళ్లకు వచ్చే సరఫరాలోనే భూమిని కలిపే సదుపాయమే న్యూట్రల్. ఇక బ్యాటరీల విషయానికి వస్తే విధిగా రెండు తీగలను (ధన, రుణ ధ్రువాలు) ఉండాలి. ఇక్కడ ఒక తీగ పనిచేయదు. ఎందుకంటే బ్యాటరీలోనే విద్యుత్ ప్రవాహం ఆరంభమవుతుంది కాబట్టి తిరిగి ఎలక్ట్రాన్లు అక్కడికే చేరాలి. లేకపోతే వలయం తెగిపోతుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...