ప్రశ్న: సూర్యుడిపై జరిగే పేలుళ్ల శబ్దం మనకు ఎందుకు వినపడదు?
జవాబు: సౌరమండలంలో సూర్యుడు కేంద్ర బిందువు. సౌర శక్తే మనం వాడే అన్ని రకాల శక్తులకు మౌలిక ఆధారం. సూర్యుడిలో ఉండేది కేవలం రెండే వాయువులు. ఇందులో సుమారు 75 శాతం హైడ్రోజన్, మిగిలింది హీలియం. కేంద్రక సంలీన చర్య వల్ల ప్రతి సెకనుకు సుమారు 60 వేల టన్నుల హైడ్రోజన్ పరమాణువులు, హీలియం పరమాణువులుగా మారుతుంటాయి. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంత సూత్రమైన E = mc2 ప్రకారం అందులో నుంచి సుమారు 420 టన్నుల ద్రవ్యరాశి శక్తిగా మారుతుంటుంది.
సూర్యుడి గోళ వ్యాసార్థం ఏడు లక్షల కిలోమీటర్లకు పైనే ఉంటుంది. సూర్యుడి కేంద్రక సంలీన చర్య అంతర్భాగం లోపల రెండు లక్షల కిలోమీటర్ల లోపే పూర్తవుతుంది. ఆ తర్వాతి పదార్థంలో ఈ శక్తి సంవహనం, వికిరణం పద్ధతుల్లో ఉపరితలానికి వ్యాపిస్తుంది. ఆ వేడి తాకిడికి మరుగుతున్న గంజిలాగా సూర్యుడి ఉపరితలంపై భీకరమైన పొంగులు వస్తుంటాయి. వీటినే సౌర జ్వాలా కీలలు అంటారు. అయితే అక్కడ బ్రహ్మాండం బద్ధలైనట్టుగా శబ్దం వస్తున్నా అది మన భూమి వరకు వినిపించదు. ఎందుకంటే సూర్యుడికి భూమికి మధ్యన దూరం 15 కోట్ల కిలోమీటర్లు. ఈ ప్రదేశమంతా కేవలం శూన్యం. శూన్యంలో కాంతి ప్రసరిస్తుందిగానీ శబ్దం ప్రయాణించలేదని మీరు వినే ఉంటారు.
సూర్యుడికి భూమికి మధ్య విస్తారంగా శూన్య ప్రదేశం ఉండడం వల్లనే మనం భీకరమైన సూర్యుడి శబ్దాల్ని వినలేము.
- ప్రొ ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్,--శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...