ప్రశ్న: వైర్‌లెస్ మైకులు ఎలా పనిచేస్తాయి?
జవాబు: వైర్లతో కూడుకున్న మైక్రోఫోన్లు (మైకులు) ఎప్పటినుంచో వాడుతున్నారు. ఈ మైక్రోఫోన్లు ట్రాన్స్మిటర్, రిసీవర్ లౌడ్‌స్పీకర్ అనే మూడు పరికరాలు కలిగి ఉండే వ్యవస్థ. వీటిని తీగల ద్వారా అనుసంధానిస్తారు.
ఈ తీగల ప్రమేయం లేకుండా వివిధ భాగాలను ఒక అనువైన గొట్టంలో అమర్చి ఉన్న సాధనమే వైర్‌లెస్ మైక్రోఫోన్ (నిస్తంత్రీ శబ్ద ప్రసారిణి). ఈ మైక్రోఫోన్‌ను సులువుగా చేతిలో పట్టుకుని వక్తలు, గాయకులు వేదికపై ఏ మూలకైనా వెళ్లొచ్చు. అవసరమైతే ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లి మాట్లాడినా ఇది శబ్దాన్ని ప్రసారం చేస్తుంది. కాకపోతే వైర్‌లెస్ మైక్ ఖరీదు కాస్త ఎక్కువ.
వైర్‌లెస్ మైక్రోఫోన్‌లో స్వల్ప పరిమాణంలో ట్రాన్స్మిటర్ రిసీవర్ PA సిస్టం లేక హెడ్‌సెట్ ఒక గొట్టంలో అమర్చి ఉంటాయి. ట్రాన్స్మిటర్ పనిచేయడానికి కావలసిన 9 ఓల్టుల బ్యాటరీ కూడా అందులోనే ఉంటుంది. ట్రాన్స్మిటర్ ఏ ఎలక్ట్రానిక్ తరంగ దైర్ఘ్యాన్ని ప్రసారం చేస్తుందో రిసీవర్ కూడా ఆ తరంగా దైర్ఘ్యానికే ట్యూనై ఉంటుంది. మైక్రోఫోన్‌లోకి ప్రవేశించిన శబ్ద తరంగాలను ట్రాన్స్మిటర్ విద్యుత్ తరంగాలుగా మార్చి అక్కడే ఉన్న ఏంటినా ద్వారా ప్రసారం చేస్తుంది. ఆ తరంగాలను గ్రహించిన రిసీవర్ అక్కడే అమర్చిన PA సిస్టమ్ లేక హెడ్‌సెట్ సాయంతో శబ్ద తరంగాలుగా మార్చి ఆ శబ్దాన్ని ఎక్కువ తీవ్రతతో ప్రేక్షకులకు అందచేస్తుంది. శబ్దం వెలువడే నోటికి, మైక్రోఫోనుకు మధ్యగల దూరాన్ని చేతి కదలికల ద్వారా మార్చి, వైర్‌లెస్ మైక్రోఫోన్ నుంచి వెలువడే శబ్ద తీవ్రతను స్వచ్ఛతను నియంత్రించవచ్చు.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...