ప్రశ్న: మంచుగడ్డల్లో పడ్డ మృతదేహం వందల సంవత్సరాలైనా చెడిపోదు. కానీ బతికున్న మనం మంచు గడ్డల్లో కొన్ని గంటలుంటే చనిపోతాము. ఈ వైవిధ్యం ఏమిటి?
-సి.ఎస్. శేఖర్, తిరుపతి
జవాబు: జీవకణంలో రసాయనిక, భౌతిక చర్యలు సజావుగా సాగినప్పుడే జీవం ఉంటుంది. ఆ చర్యలకు ఉష్ణోగ్రత కూడా అనువుగా ఉండాలి. ఉష్ణోగ్రత అధికంగా పెరిగినా, బాగా తగ్గిపోయినా జీవచర్యలు అదుపు తప్పుతాయి. అందువల్లనే విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు, లేదా విపరీతమైన ఎండలున్నప్పుడు మనిషి చనిపోతాడు. అలాగే మంచు గడ్డల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద కూడా మరణం ఏర్పడుతుంది. ఇక మృతదేహం చెడిపోవడమంటే, దాని మీద వాతావరణం, మట్టి, నీరు తదితర పరిసరాల్లో ఉండే సూక్ష్మజీవులు దాడి చేసి, అందులోని మాంసకృత్తుల్ని, ఇతర పదార్థాలను గ్రహించడమే. ఆ సూక్ష్మజీవులు తమ ప్రతాపం చూపాలన్నా కూడా వాటికీ అనువైన ఉష్ణోగ్రత ఉండాల్సిందే. అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద సూక్ష్మజీవులు తమ దాడిని కొనసాగించలేవు. సంతానాన్ని వృద్ధి చేసుకోలేవు. అందువల్లనే మంచుపర్వతాల్లో మరణించినవారి శరీరాలు వేలాది ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉంటాయి. అల్ప ఉష్ణోగ్రతల వద్ద సూక్ష్మజీవులు పనిచేయలేవు కాబట్టే, ఫ్రిజ్‌లో పెట్టిన పదార్థాలు చెడిపోవు.
-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్;-రాష్ట్రకమిటీ,జనవిజ్ఞానవేదిక
- ==========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...