Thursday, September 29, 2011

పాము చిన్న- విషము మిన్న సంగతేమిటి ?,What about Small snake-dangerous poison?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : పాము చిన్న- విషము మిన్న సంగతేమిటి ?
జ : పాముల లోకంలో... మరో కొత్త సర్పం! అదేంటో? ఏ జాతికి చెందిందో?విశేషాలేంటో తెలుసుకుందామా!
భూమిపై దాదాపు 2,700 జాతుల పాములు తిరుగాడుతున్నాయి. ఇందులో మూడు వందలకు పైగా విషపూరితమైనవి. ఈ విషపూరితమైన పాముల జాబితాలో ఇప్పుడు మరొక కొత్త పాము కలిసింది. ఇది ఎన్నో వేల ఏళ్ల నుంచి ప్రపంచంలో బతుకుతున్నప్పటికీ శాస్త్రవేత్తల కంటపడింది మాత్రం ఈ మధ్యనే. మట్టి, బూడిద రంగులు కలిసినట్లుగా ఉండే ఈ పాము చైనా అడవుల్లో పాక్కుంటూ పోతుంటే పరిశోధకులు పట్టుకున్నారు. పరిశీలిస్తే ఇది రక్తపింజరి (పిట్‌వైపర్‌) జాతికి చెందిన కొత్తరకమని తేలింది. ఇప్పటికే ఈ జాతిలో 200 రకాల పాములున్నాయి. ఇంతకీ దీని పొడవెంతో తెలుసా? కేవలం రెండున్నర అడుగులు! అందుకే దీన్ని చిన్నపాముల జాబితాలో చేర్చారు.

రక్తపింజరి పాములు ప్రమాదకరమైనవి. కొత్త పాము చిన్నదే అయినా ఇది కరిస్తే మనిషి చనిపోతాడు. ఇది దొరికిన అడవి ప్రాంతాల్లో గిరిజనులు దీని కాటుకు బలవుతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. వీటి విషం రక్తనాళాల్ని, కండరాల్ని దెబ్బతీస్తుంది.

ఈ జాతి పాములకి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదేంటో తెలుసా? రాత్రయినా, పగలైనా తమ ఆహారం లేదా శత్రువులు ఎంత దూరంలో ఉన్నాయో సులువుగా తెలుసుకోగలవు. కళ్లకి, ముక్కుకి మధ్య ఉండే రెండు చిన్న రంధ్రాల్లాంటి భాగాల వల్ల దీనికి ఆ శక్తి వచ్చింది. ఆ భాగాల్నే 'పిట్‌' అంటారు. దానికి కొంచెం దూరంలో ఏ ఎలుకో ఉందనుకోండి, దాని శరీర ఉష్ణోగ్రతను పిట్‌ భాగాలు గ్రహించేస్తాయి. దాన్ని బట్టి అది ఎంత దూరంలో, ఏ దిశలో ఉందో పాముకి తెలిసిపోతుంది. అంతేకాదు పరారుణ కిరణాలను గ్రహించే శక్తి ఉన్న దీని కళ్ల వల్ల ఆ జీవి ఎక్కడ దాగి ఉన్నా ఇది పసిగట్టేస్తుంది. ఈ విద్యల వల్లనే అది శత్రువుల ఉనికిని కూడా ముందుగానే గ్రహంచి జాగ్రత్త పడిపోతుంది.

మూలము : ఈనాడు దినపత్రిక (27-09-2011).
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...