ప్రశ్న: నున్నటి చదునైన ప్రదేశాల్లో కూడా ఉడుము సులభంగా పరుగెత్తడమే కాకుండా గట్టిగా పట్టుకుని ఉండగలదు. ఇదెలా సాధ్యం?
-ఎమ్. రాజారావు, 8వ తరగతి, ఉరవకొండ
జవాబు: ఉడుములు వరానిడే కుటుంబానికి చెందిన పెద్ద మాంసాహారులైన బల్లులు. వీటిలో అతిపెద్ద ఉడుము కొమొడొ డ్రాగన్. ఈ కుటుంబంలో ఉన్న ఒకే ప్రజాతి వరానస్.ఉడుము గాజులాంటి నున్నటి తలాలపై కూడా నిట్టనిలువుగా పరుగెత్త గలదు. పైకప్పులను గట్టిగా పట్టుకుని స్థిరంగా ఉండగలదు. వాటి పాదాల కింద ఉండే ప్రత్యేకమైన మెత్తలే (pads) ఇందుకు కారణం. వీటిపై లక్షలాది వెంట్రుకలు, వేలాది బొడిపెలు (bulges) ఉంటాయి. ఈ సూక్ష్మ వెంట్రుకల రాపిడి వల్ల దుర్బల స్థిర విద్యుత్ బలాలు (weak electrostatic forces) ఉత్పన్నమై అవి తలానికి అంటుకుని పోతాయి. ఒకో బొడిపె అతుక్కునే బలం (adhesive force) తక్కువే అయినా, వేలాది బొడిపెల వల్ల ఉత్పన్నమయ్యే బలం ఎక్కువవడంతో ఉడుము గట్టి పట్టును కలిగి ఉంటుంది. ఇలా దాని నాలుగు పాదాల వల్ల కలిగే బలం వల్ల దాదాపు 140 కిలోల బరువును కూడా లాగుతూ నిలువుగా ఎగబాకగలదు. అందుకే పూర్వం సైనికులు ఉడుముల నడుములకు తాళ్లను కట్టి వాటిని పట్టుకుని కోట గోడలను ఎక్కేవారు. 'ఉడుము పట్టు' వ్యవహారికంగా మారడానికి ఇదే కారణం.
-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...