ప్రశ్న: భూమి లోపల అమర్చిన లాండ్‌మైన్స్ ఉనికిని ఎలా కనిపెడతారు?
-ఎమ్. నటరాజన్, 10వ తరగతి, తిరుపతి
జవాబు: భూమిని తవ్వి లోపల పేలుడు పదార్థాలను అమర్చి మట్టిని కప్పేయడం వల్ల లాండ్‌మైన్స్ (మందుపాతరలు) ఉనికి పైకి తెలియదు. దాని మీంచి బరువైన వాహనాలు ప్రయాణించినప్పుడు ఆ ఒత్తిడికి పేలుతాయి. లేదా వాటిని అమర్చిన దుండగులు రిమోట్ కంట్రోలు సాయంతో దూరం నుంచి పేలుస్తుంటారు. మందుపాతరల ఉనికిని కనిపెట్టడం మెటల్ డిటెక్టర్ల సాయంతో కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాటిలో అమర్చే పేలుడు పదార్థాలను లోహమిశ్రమాలతో కాకుండా కృత్రిమమైన సింథటిక్ మెటీరియల్స్‌తో చేస్తారు. అయితే కప్పెట్టిన పేలుడు పదార్థాల పరమాణువులు ఆవిరవుతూ నేలలోని పగుళ్లగుండా బయట వాతావరణంలో కలుస్తూ ఉంటాయి కాబట్టి, వాటిని కనిపెట్టగలిగే పరికరాలు ఉంటాయి. మానవ శరీరంలోని భాగాలను చిత్రాల ద్వారా తెరపై చూపించే 'న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసోనెన్స్' సాధనం ద్వారా మందుపాతరల ఉనికిని చూడవచ్చు. వీటి ద్వారా వెలువడే విద్యుదయస్కాంత తరంగాల సాయంతో పేలుడు పదార్థాల నుంచి వెలువడే అణువులను కనిపెట్టవచ్చు. అలాగే కొన్ని పరికరాల ద్వారా శక్తిమంతమైన శబ్దతరంగాలను భూమి లోపలికి ప్రసరించేలా చేస్తారు. అవి మందుపాతరలను స్వల్పంగా కంపింపజేస్తాయి. ఈ కంపనాలను గ్రాహకాల ద్వారా నమోదు చేసి పేలుడు పదార్థాలు ఎంత దూరంలో ఉన్నాయి, వాటి తీవ్రత ఎంత, ఏ రకానికి చెందినవి అనే విషయాలను కనిపెడతారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===================================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...