ప్రశ్న: ఈ మధ్య కొన్ని టార్చిలైట్లు చీకట్లో మెరుస్తున్నట్టు మనకి కనిపిస్తాయి. ఈ కాంతి ఎక్కడిది?
-కె. హయగ్రీవాచారి, కాజీపేట
జవాబు: ఉన్నట్టుండి కరెంటు పోతే ఆ చీకట్లో టార్చిలైటు ఎక్కడుందో గుర్తించేందుకు వీలుగా ఈమధ్య వాటిని ఓ ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేస్తున్నారు. ఇవి చీకట్లో మంద్రస్థాయిలో వెలుగులీనుతూ కనిపిస్తాయి. కాంతికీ, పదార్థాలకూ మధ్య చాలా విధాలైన భౌతిక, రసాయనిక సంబంధాలున్నాయి. వాటిలో ఒకటి ఫాస్ఫారిసెన్స్(Phosphorescence) అనే ధర్మం. ఈ ధర్మాన్ని ప్రదర్శించే పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు జింకు సల్ఫైడు, స్ట్రాన్షియం అల్యూమినేట్ మొదలైన ఇలాంటి పదార్థాల అణువులు కాంతి సమక్షంలో ఉత్తేజం (exitation) పొందుతాయి. ఇవి ఈ ఉత్తేజ స్థాయిలోనే చాలా సేపు ఉంటూ మెల్లమెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటాయి. అకస్మాత్తుగా కాంతి పడడం ఆగిపోయినప్పుడు కూడా ఇవి ఇలాంటి స్థితిలోనే ఉండడం వల్ల వాటి నుంచి ప్రత్యేకమైన కాంతి వెలుగులీనుతూ కనిపిస్తుంది. దీన్నే ఫాస్ఫారిసెన్స్(Phosphorescence) అంటారు. టార్చిలైట్లతో పాటు గదుల సీలింగ్‌కు అతికించే నక్షత్రాలు, గ్రహాల లాంటి చిన్న చిన్న పరికరాలను కూడా ఇలాంటి పదార్థాలతోనే చేస్తారు. గదిని చీకటి చేసినప్పుడు ఇవి వెలుగు చిమ్ముతూ ఆకట్టుకోవడాన్ని గమనించే ఉంటారు. అయితే కాసేపటిలోనే వాటి కాంతి ఆగిపోతుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...