ప్ర : హిప్నాటిజం అంటే ఏమిటి, దీనిని ఎవరు కల్పించారు, ఎలా పని చేస్తుంది, ఎందుకు ఉపయోగిస్తారు ?
జ : హిప్నాటిజం అంటే సమ్మోహనపరిచే విద్య. ఇంగ్లాండ్ దేశపు డాక్టర్ జేమ్స్ బ్రెయిడ్ దీనికి శాస్త్రీయస్థాయిని కల్పించాడు. మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా, ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి, వారి మనస్సులపైన శరీరంపైన వారికి ఆధీనం తప్పింపజేయడమే హిప్నాటిజం అంటే. అలా ఆదీనం తప్పిన వ్యక్తులు నిద్రావస్థలోకి వెళ్ళి తమకు తెలియకుండానే హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది చేస్తారు. హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్దతిని జర్మన్ దేశస్తుడైన 'ఫెడరిక్ ఆంటోన్ మెస్మర్' కనిపెట్టాడు. దీన్నే 'మెస్మరిజం' అంటారు. శారీరక, మానసిక వ్యాధులను నయం చేయడానికి 'హిప్నోథెరఫీ' ఎక్కువగా వాడుకలోకి వచ్చింది.
డాక్టర్ ఎన్ డైలే అనే ఆంగ్లవైద్యుడు భారతదేశంలో హిప్నాటిజం వ్యాప్తికి కృషిచేశాడు. ఆయన 19వ శతాబ్దంలో మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేసే విధానం కనిపెట్టని సమయంలో రోగులను హిప్నాటైజ్ చేసి, వారికి ఏమాత్రం నొప్పిలేని విధంగా శస్త్ర చికిత్సలు, అంటే ఆపరేషన్‌లు చేసేవాడు. ఆపరేషన్ పూర్తయిన తరువాత రోగులను ప్రశ్నించగా, వారు తమకు ఏ నొప్పి కలుగలేదని చెప్పారట. ఆ పద్దతిలో డా.ఎన్ డైలే ఆకాలంలో ప్రపంచవ్యాప్తంగా 300 ఆపరేషన్లు నొప్పి తెలియకుండా చేసి సంచలనం సృష్టించాడు. హిప్నాటిస్ట్ నేరాలు చేయదలచుకుంటే వశీకరణకు లోబడిన వారిని దీర్ఘసుషుప్తిలోకి తీసుకుపోయి తన ఇష్టం వచ్చినట్లు చేయించగలడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1952లో హిప్నాటిజం చట్టం రూపొందించింది. దీని ప్రకారం శాస్త్రీయ ప్రయోజనాలకోసమో, లేక రోగులకు వైద్యం చేయడానికో తప్ప హిప్నాటిజాన్ని వాడకూడదు. ప్రస్తుతం అనేకమంది హిప్నాటిజాన్ని వృత్తిగా స్వీకరించి, అనేక మ్యాజిక్కులు చేసి ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నారు.
- =======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...