చిన్న పక్షి... తీయగా పాడుతుంది... రంగులతో ఆకట్టుకుంటుంది... అలాగని పట్టుకుందామనిపిస్తోందా? ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే!
ఆ పిట్ట చెట్టు కొమ్మ మీద ఉంటే చూసి ఆనందించడమే మంచిది. పట్టుకున్నారో ప్రమాదమే. ఎందుకంటే అది విషపూరితం. నలుపు, నారింజ రంగుల్లో ముద్దుగా ఉన్న దాన్ని తాకితే చాలు, దాని ఈకలు, శరీరంపై ఉండే విషం ఎక్కేస్తుంది. తోటి జీవులకే కాదు, మనుషులకి కూడా అది ప్రమాదమే. ఒళ్లంతా తిమ్మిరి పట్టడం, తల తిరగడం వంటిలక్షణాలు కలిగి ఒకోసారి పక్షవాతం రావడం, మరణించడం కూడా జరిగే ప్రమాదముంది. అందుకే ఇది ప్రపంచంలో ఉన్న పక్షులన్నింటిలో విషపూరితమైనదిగా పేరు తెచ్చుకుంది. తోక నుంచి ముక్కు దాకా ఎక్కడ తాకినా అంతా విషమయమే.
న్యూగినియా అడవుల్లో కనిపించే ఈ పక్షి పేరు పితోహి. చర్మం, ఈకలపై ఒకరకమైన విషరసాయనం ఉంటుంది. ఇదే దానికి రక్షణ కవచం కూడా. పాములు, ఇతర జంతువుల నుండి రక్షించుకోడానికి ఉపయోగపడుతుంది. విచిత్రమేమిటంటే ఈ విషం దాని శరీరంలో ఉత్పత్తి కాదు. మరెక్కడి నుంచి వస్తుంది? అది తినే ఆహారం ద్వారా ఏర్పడుతుంది. ఇవి ఎక్కువగా కోరెసైన్ అనే కీటకాలను ఆరగిస్తూ ఉంటాయి. వాటిలో ఉండే విషాన్నే దీని చర్మం, ఈకలు స్రవిస్తూ ఉంటాయి. జీవులన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన జీవిగా 'పాయిజన్ డాట్ కప్ప'ని పేర్కొంటారు. దాని శరీరంపై ఉండే విషరసాయనమే దీనిపై కూడా ఉంటుందని కనుగొన్నారు. వీటిపై 1989 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి.
న్యూగినియా గిరిజనులకు వీటి గురించి ముందే తెలుసు. వీటిని వాళ్లు 'గార్బేజ్ బర్డ్స్' అంటారు. అంటే చెత్త పక్షులన్నమాట. వీటి శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది. అందుకే ఆ పేరు. చాలా మంది వీటి జోలికి పోకపోయినా, కొందరు మాత్రం వీటి మాంసాన్ని వండుకుని తింటారు. చర్మాన్ని, ఈకల్ని తొలగించి బొగ్గుపొడిలో దొర్లించి కాల్చుకు తింటారు. అలా తిన్నాక ఒకోసారి అనారోగ్యాల బారిన పడుతుంటారు కూడా. వీటిలో ఆరు జాతులుంటే, మూడు విషపూరితమైనవే.
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...