ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: సెల్యులోజ్ అంటే ఏమిటి?,What is Cellulose?
జవాబు: సెల్యులోజ్ అనేది మొక్కలు ఉత్పత్తి చేసే ఒక పదార్థం. మొక్కలకు వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడును, నీటిని కలిపి గ్లూకోజ్ అనే చక్కెర పదార్థంగా మార్చే శక్తి ఉందని పాఠాల్లో చదువుకుని ఉంటారు. అలా తయారు చేసిన గ్లూకోజ్‌ను మొక్కలు ఏం చేస్తాయనే విషయం వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ మొక్కా గ్లూకోజ్‌ను ఎక్కువగా నిల్వ ఉంచుకోదు. ఎందుకంటే గ్లూకోజ్ ఎక్కువగా ఉండే మొక్కల కణాలు ఎక్కువ నీటిని శోషించుకోవలసి ఉండడంతో అవి పగిలి విచ్ఛిన్నమవుతాయి. అలాగే గ్లూకోజ్ ఎక్కువయ్యే కొద్దీ కిరణజన్య సంయోగ క్రియ(photosynthesis) వేగం తగ్గిపోతుంది.
ఈ ప్రమాదం నుంచి తప్పించుకోడానికి మొక్కల్లో అదనపు గ్లూకోజ్ అణువులతో పొడవైన గొలుసులను తయారు చేసే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ గొలుసులలో పిండిపదార్థం (starch) ఒకటైతే, మరొకటి సెల్యులోజ్.
సెల్యులోజ్ గొలుసుల పొడవు ఒకో మొక్కకు ఒకోలా ఉంటుంది. ఉదాహరణకు పత్తిమొక్కలో తయారయే ఒకో సెల్యులోజ్ గొలుసులో 10,000 గ్లూకోజ్ అణువులు ఉంటాయి. సెల్యులోజ్ మొక్కలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొక్క యొక్క కణాల గోడలు దృఢమైన సెల్యులోజ్ పదార్థంతోనే తయారవుతాయి. ఆ ఏర్పాటు లేకపోతే మొక్క తన భారానికి తానే ముడుచుకుపోయి నశిస్తుంది.
సెల్యులోజ్ మనకు ఆహారంగా పనికిరాదు. మన జీర్ణవ్యవస్థలో పిండి పదార్థాల గొలుసులను గ్లూకోజ్ అణువులుగా విడగొట్టగల ఎంజైములు ఉన్నాయి కానీ, సెల్యులోజ్‌ను విడగొట్టగల ఎంజైములు లేవు. మనం మొక్కలకు సంబంధించిన ఆహారాన్ని తీసుకుంటే వాటిలోని పిండిపదార్థం జీర్ణమై, సెల్యులోజ్ భాగం విసర్జితమవుతుంది. ఎండుకట్టెలలో సెల్యులోజ్ అధికంగా ఉండడంతో ఎక్కువ ఉష్ణాన్నిచ్చే వంట చెరకుగా ఉపయోగపడతాయి. సెల్యులోజ్‌ను కాగితం, వస్త్రాలు, రేయాన్, సెల్లోఫేన్, సెల్యులాయిడ్ లాంటి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...