ప్ర : మొనాకో దేశం సంగతేమిటి ?, What is about Monaco Country?
జ : యూరప్‌లో పర్యాటకులని ఆకర్షించే ఓ చిన్న దేశం ఇది. ప్రపంచంలోని రెండో చిన్నదేశం వాటికన్ సిటీ. మొదటిది అయిన మొనాకో ప్రపంచంలో అధిక జనసాంద్రత గల దేశం. ఫ్రాన్స్, ఇటలీల మధ్యగల మొనాకో విస్తీర్ణం రెండు చదరపు కిలోమీటర్లే! జనాభా 35,986. ప్రపంచంలో అధిక కాలం జీవించేది కూడా మొనాకో దేశస్థులే - తొంభై ఏళ్లు! నిరుద్యోగం జీరో పర్సంట్! ఫ్రాన్స్, ఇటలీల నించి ప్రతిరోజూ ఈ దేశంలోకి నలభై వేల మంది ఉద్యోగులు వచ్చి పని చేసి వెళ్తూంటారు. మెడిటరేనియన్ సీ తీరాన గల మొనాకోకి పాయింట్ సెవెన్ కిలోమీటర్ల విస్తీర్ణం మేర సముద్రాన్ని పూడ్చి భూభాగాన్ని పెంచారు.
ఇక్కడ 1297 నించి రాజ్యాంగబద్ధమైన రాజరికం కొనసాగుతోంది. ప్రిన్స్ ఆల్బర్ట్-2 నేటి రాజు. దీని రక్షణ బాధ్యత ఫ్రాన్స్ దేశానిది. ఇక్కడి మోంటీ కార్లో నగరం పర్యాటకులని అధికంగా ఆకర్షిస్తుంది. అందుకు కారణం అక్కడ గల జూదగృహాలు.
లీగ్రాండ్ కేసినో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అందులో సినిమా థియేటర్, బాలే థియేటర్ మొదలైన వినోదాలు ఉన్నాయి. రాజ కుటుంబం భాగస్వాములుగా ఓ పబ్లిక్ కంపెనీ దీన్ని నిర్వహిస్తోంది. మోంటీ కార్లోలోనే కాక మొనాకో అంతటా నైట్ క్లబ్స్ విస్తారంగా ఉంటాయి. రౌలెట్, స్టడ్‌పోకర్, బ్లాక్‌జాక్, క్రాప్స్, బకారట్ లాంటి జూదాలు, స్లాట్ మెషీన్స్ అన్ని కేసినోలలో ఉంటాయి. తమాషా ఏమిటంటే మొనాకన్స్ - అంటే మొనాకో దేశస్థులకి మాత్రం వీటిలోకి ప్రవేశం లేదు. ప్రతీ కేసినో బయట సందర్శకుల పాస్‌పోర్ట్‌లని తనిఖీ చేసే లోపలికి పంపుతారు. ఈ దేశపు ప్రధాన ఆదాయం కేసినోల నించే వస్తోంది. 1873లో జోసెఫ్ డేగర్ అనే అతను కేసినోలోని రౌలెట్ వీల్స్ తిరిగే పద్ధతిని జాగ్రత్తగా గమనించి మోంటీ కార్లో బేంక్‌ల్లోని డబ్బుకన్నా ఎక్కువ జూదంలో సంపాదించాడు. దీన్ని ‘బ్రేకింగ్ ది బేంక్ ఎట్ మోంటీ కార్లో’గా పిలుస్తారు.
జేమ్స్‌బాండ్ నవలా రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ 1953లో రాసిన మొదటి నవల ‘కేసినో రాయల్’ నేపథ్యం ఇక్కడిదే. బాండ్ సినిమాలు ‘నెవర్ సే నెవర్ అగైన్’ ‘గోల్డెన్ ఐ’ ‘కేసినో రాయల్’ చిత్రీకరణ ఇక్కడ జరిగింది.
1866లో మోంటీకార్లోకి ఆ పేరు ఇటాలియన్ భాష నించి వచ్చింది. దాని అర్థం వౌంట్ ఛార్లెస్. ఛార్లెస్-3 గౌరవార్థం ఈ పేరు ఆ నగరానికి పెట్టబడింది.
ఇక్కడి మరో ఆకర్షణ ఫార్ములా ఒన్ గ్రాండ్ ప్రిక్స్ పోటీ. సింగిల్ సీటర్ ఆటో రేసింగ్‌ని గ్రాండ్స్ పిక్స్ పేరుతో ఇక్కడ నిర్వహిస్తున్నారు. గంటకి 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఎఫ్ ఒన్ (్ఫర్ములా ఒన్) కార్లు ఈ రేసుల్లో పాల్గొంటాయి. ప్రపంచం నలుమూలల నించి రేసర్లు వచ్చి ఈ పోటీల్లో పాల్గొంటారు. 1879లో ఆరంభించిన శాలీగార్నియర్ లేదా ఒపేరా డి మాంటీ కార్లో అనేక నాటక శాలలో ఒపేరాలు జరుగుతూంటాయి. ముందే వీటికి టిక్కెట్ బుక్ చేసుకోవాలి.
1864లో నిర్మించబడ్డ హోటల్ డి పేరిస్, మోంటీ కార్లో నడిబొడ్డున ఉంది. 106 గదులు గల ఈ హోటల్‌లో వివిధ దేశాల ప్రముఖులు బస చేసారు. దీన్ని కూడా పర్యాటకులు ఆసక్తిగా చూస్తారు.
హాలీవుడ్ నటి గ్రేస్‌కెల్లీ, ప్రిన్స్ రెయినియర్‌ని వివాహం చేసుకుని ఇక్కడే నివసించింది. ఆమె కొడుకే నేటి రాజు ఆల్బర్ట్-2. హాలీవుడ్ హీరోయిన్స్‌లో మహారాణి అయింది ఈమె మాత్రమే. 1954లో ఇక్కడ ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ ‘కు టేచ్ ఏ థీఫ్’ అనే చిత్రాన్ని ఇక్కడ చిత్రీకరించాడు.
ఇంకా మ్యూజియం ఆఫ్ ఏంటిక్ ఆటోమొబైల్స్ (ఇందులో ప్రిన్స్ రెయినియర్ 85 వింటేజ్ కార్లని కూడా చూడచ్చు) ప్రినె్సస్ గ్రేస్ రోజీ గార్డెన్, స్టాంప్స్ అండ్ మనీ మ్యూజియం, లూయిస్-2 స్టేడియం, మ్యూజియం ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఏంత్రోపాలజీ, ఓషనోగ్రాఫిక్ మ్యూజియం, మ్యూజియం ఆఫ్ నెపోలనిక్ సావెనీర్స్ ఇక్కడ చూడదగ్గవి.
మే నించి అక్టోబర్ దాకా టూరిస్ట్ సీజన్. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల నించి రోడ్డు మార్గంలో అరగంటలో ఇక్కడికి చేరుకోవచ్చు. యూరప్‌లోని అన్ని ముఖ్య నగరాల నించి ఇక్కడికి విమాన సర్వీసులున్నాయి.
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...