ప్రశ్న: వృద్ధాప్యంలో తల వెంట్రుకలు తెల్లబడతాయెందుకు?.
జవాబు: వెంట్రుకలు దేహంపై ఉండేే చర్మంలో ఒక భాగం. చర్మం ఛాయ శరీరంలో ఉండే ఐదు పిగ్మెంట్ల (రంగుతో కూడిన పదార్థాలు)పై ఆధారపడి ఉంటుంది. ఈ పిగ్మెంట్లలో 'మెలానిన్' ముఖ్యమైనది. ఇది దేహంలో ఉండే మెలనోసైటిస్ అనే కణాల నుండి ఉత్పన్నమవుతుంది. ఈ మెలానిన్ చర్మం కింది భాగంలో, వెంట్రుకలలో, కళ్ళలో ఉంటుంది. మెలానిన్ తక్కువ పాళ్లలో ఉంటే శరీరం తెల్లగాను, ఎక్కువగా ఉంటే నల్లగాను ఉంటారు. కళ్లు, వెంట్రుకల రంగు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా వృద్ధాప్యంలో శరీర ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. మెలనోసైటిస్ కణాలు తక్కువ శాతంలో మెలానిన్‌ను ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వృద్ధులకు తల నెరుస్తుంది. నిజానికి ప్రతి వెంట్రుక పారదర్శకంగా ఉండే ఒక సన్నని గొట్టం లాంటిది. ఆ గొట్టం నిండా మెలానిన్ ఉన్నంత కాలం ఆ వెంట్రుక నల్లగా ఉంటుంది. దానికి తగినంత మెలానిన్ అందకపోతే వెంట్రుక నల్లని రంగు క్రమేపీ మారి గొట్టం మొత్తం ఖాళీ అయిపోగానే తెల్లగా కనిపిస్తుంది. బాల్‌పాయింట్ పెన్ రీఫిల్ నిండా ఇంకు ఉన్నప్పుడు నల్లగాను, ఇంకు పూర్తిగా అయిపోయిన తర్వాత తెల్లగాను కనబడినట్టే ఇది కూడానన్నమాట. ఒకోసారి మెలనోసైటిస్ కణాలు మెలానిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడంతో యుక్తవయసులోనే కొందరి తల వెంట్రుకలు తెల్లబడతాయి. దీన్నే బాలనెరుపు అంటారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==========================
tella ventrukalu enduku and ela erpadutayo vivarincharu...tellaventrukalu ravadaniki karanam telisinanduku santosham ga vundi..
ReplyDeletekani ee tella ventrukalanu ela nivaranchalo vivarincha galaru..