ఈ చిలుక పేరు వాసా ప్యారెట్. ప్రపంచంలోని చిలుక జాతుల్లో ఇదీ ఒకటి. అంతేకాదు వాటన్నింటిలో భిన్నమైన లక్షణాలున్నది కూడా ఇదే. చూడాలంటే మడగాస్కర్ అడవులకి వెళ్లాల్సిందే. ఒకప్పుడు పెంపుడు పక్షులుగా విపరీతంగా అమ్మేవారు. ఇప్పుడు వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో జంతు ప్రదర్శన శాలల్లోనే కనిపిస్తున్నాయి.
వాసా చిలుకల్లో ఆడవి మరీ చిత్రంగా ఉంటాయి. పక్షి జాతిలో వేటికీలేని లక్షణం వీటికుంది, అదేంటో తెలుసా? తల మీద బొచ్చులా ఒత్తుగా ఉండే ఈకల్ని పూర్తిగా వదిలించేసుకోగలవు. అప్పుడిది బోడి చిలుకలా ఉంటుంది. ఆ నెత్తి మీద చర్మం లేత నారింజ రంగులో ఉంటుంది. ఇవి తాము కోరుకున్నప్పుడు ఒంటి మీద ఉన్న ఈకల రంగుని బూడిద రంగు నుంచి లేత మట్టి రంగులోకి మార్చేసుకుంటాయి. గుడ్లు పెట్టే సమయంలో అయితే ఆ మట్టిరంగు పసుపు రంగులోకి మారిపోతుంది. దీని ఒంట్లో ఉన్న కొన్ని రసాయనిక గ్రంధుల వల్లే రంగు మార్పు సాధ్యమవుతుందని పరిశోధకుల అభిప్రాయం. ఒక్క ఆడవే కాదు మగవి కూడా తమ రంగుని మార్చుకోగలవు.
వాసా చిలుకల్లో ఆడవాటికి చాలా కోపం ఎక్కువ. వాటికి నచ్చినట్టు ఉండకపోతే మగ చిలుకల్ని వెంటపడి తరుముతాయి. అడిగినప్పుడు ఆహారం తెచ్చి పెట్టకపోయినా మగవాటి పని అయిపోయినట్టే. వాసా చిలుకలు తిండిపోతులు. ఇరవై అంగుళాల పొడవు పెరిగే ఇవి పండ్లు విత్తనాలు, రకరకాల గింజలు నిత్యం తింటూనే ఉంటాయి. ఇవి నిశ్శబ్దంగా ఉండే పక్షులు. తమ గూడులో గుడ్లను పెట్టి ఆ గుడ్లు కనిపించకుండా రకరకాల ఆకులు, పుల్లలు, చెత్త చెదారం తెచ్చి నింపేస్తాయి. అన్నట్టు వీటికి స్నానం చేయడం అంటే చాలా ఇష్టం. నీళ్లు, బురద ఎక్కడ కనిపించినా వెళ్లి దూకాల్సిందే. అప్పుడప్పుడు సూర్య స్నానం కూడా చేస్తాయి. ఎండకి ఎదురుగా తిరిగి ఈకల్ని ఆరబెట్టుకుంటాయి.
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...