Wednesday, March 10, 2010

స్నైప్‌ ఈల్‌ చేప సంగతేమిటి ?, Snipe Eel fish story




తాడా? పామా? చేపా ?
తాడులాంటి రూపం.. అయిదడుగుల పొడవు.. బాతులాంటి ముక్కు.. ఈ వింత చేప పేరు.. స్నైప్‌ ఈల్‌

భూమ్మీద వెన్నెముక ఉన్న జీవుల గురించి తెలుసు కదా? ఆ వెన్నెముకలో వెన్నుపూసలుంటాయి కదా? మరి ప్రపంచం మొత్తం మీద ఎక్కువ వెన్నుపూసలు కలిగి ఉండే జీవి ఏది? అదే స్నైప్‌ఈల్‌. దీనికి ఏకంగా 750 వెన్నుపూసలుంటాయి మరి. సముద్రంలో దాన్ని అదాటుగా చూస్తే ఏ దారమో, కొట్టుకు పోతున్నట్టు ఉంటుంది. పరీక్షగా చూస్తే అదో జలచరమని అర్థమవుతుంది. సన్నని పాములా కనిపించే దీన్ని అందుకే 'థ్రెడ్‌ ఫిష్‌' అని కూడా అంటారు. అంటే దారంచేపన్నమాట. ఇది ఈల్‌ చేపల కోవకే చెందినా, మిగతావాటి కన్నా భిన్నంగా ఉంటుంది.

ఇదెంత పొడవు పెరుగుతుందో తెలుసా? అయిదడుగులకు పైమాటే. దీని శరీరం వెడల్పుతో పోలిస్తే పొడవు 75 రెట్లు ఎక్కువగా ఉంటుంది. శరీరం కూడా చాలా మెత్తన. దీని నోరు భలే వింతగా ఉంటుంది. బాతు ముక్కులాగా ఉండే ఇది నోరు మూసుకుని ఉన్నా దవడలు కలవవు. ఎందుకంటే దవడలు రెండూ ఒకటి పైకి, ఒకటి కిందికి మెలి తిరిగినట్టు ఉంటాయి. అంటే నోరు మూసినా తెరిచినట్టే ఉంటుందన్నమాట. ఆ నోరుని బార్లా చాపి సముద్రంలో ఈదుతుంటే బుల్లి జలచరాలు దూరిపోతుంటాయి. అందినవి అందినట్టు గుటకాయ స్వాహా చేస్తూ ఇది ఈదుకుంటూ పోతుంటుంది. నోట్లో పళ్లు వెనక్కి ఉండడంతో ఓసారి చిక్కినది జారిపోవడం కష్టమే. అన్ని సముద్రాల్లోనూ దాదాపు 6000 అడుగుల లోతులో కాలక్షేపం చేసే ఇవి ఏకంగా పదేళ్లు బతుకుతాయి.
మీకు తెలుసా?
* ప్రపంచంలో మొత్తం 600 జాతుల ఈల్‌ చేపలు ఉన్నాయి.
* ఇవి ముందుకి, వెనక్కి కూడా ఈదగలవు.
* వీటిల్లో కొన్ని జాతుల చేపలు గుడ్లును పెట్టడానికి 4000 కిలోమీటర్ల దూరం వలస వెళతాయి.
  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...