సముద్రపు అట్టడుగున ఉండే దాన్ని అదాటుగా చూస్తే ముళ్లబంతిలా కనిపిస్తుంది. గుండ్రంగా ఉండే ఎడారి మొక్కలాంటిదేమో అనిపిస్తుంది. కానీ ఇదొక జీవి. సీ అర్చిన్ అనే ఈ జీవి వెన్నెముక లేని స్టార్‌ఫిష్ కుటుంబానికి చెందిదే. గుండె, మెదడు ఉండని దీనికి కళ్లు కూడా ఉండవని ఇన్నాళ్లూ అనుకున్నారు. కానీ తాజా పరిశోధనలో ఏం తేలిందో తెలుసా? దీని ముళ్లే కళ్లుగా పనిచేస్తాయని!
ఎక్కడో సముద్రం అడుగున పడి ఉండే దీని మీద ఎందుకు పరిశోధన చేస్తున్నారో తెలుసా? దీనికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. వందేళ్లు, రెండొందల ఏళ్లు కూడా బతికేసే వీటి ద్వారా మనకి ఉపయోగపడే మందుల్ని కనిపెట్టే అవకాశం ఉందన్నమాట.
సీ అర్చిన్లు భలే వింతగా ఉండే జీవులు. నలుపు, ఆకుపచ్చ, ఊదా, ఎరుపు రంగుల్లో ఉండే ఇవి ఏ రాయికో అంటిపెట్టుకుని కదలవు. ఒకవేళ వెళ్లాలనుకుంటే ముళ్లమీదుగానే దొర్లుకుంటూ పోతాయి. వీటి నోరు శరీరం కింద ఉంటుంది. ఆ నోట్లో ఉండే అయిదు దంతాలతో ఇది సముద్రంలో ఉండే బండరాళ్ల మీద కూడా రంధ్రాలు చేయగలదు. దాదాపు 4 నుంచి 10 అంగుళాల పరిమాణం వరకూ ఉండే వీటి తిండి కూడా చిత్రమే. సముద్రపు మొక్కలు, జంతువుల అవశేషాలతో పాటు బురద, ఇసుక ఇలా ఏదైనా లాగించేయగలవు.
గుండ్రని శరీరం నుంచి అన్ని వైపులకీ పొడుచుకు వచ్చినట్టుండే ముళ్ల వల్లనే దీన్ని 'సముద్రపు ముళ్లపంది' అని కూడా పిలుస్తారు. శత్రువుల నుంచి కాపాడుకోడానికి దీనికి ముళ్లే రక్షణ కవచంలాగా ఉపయోగపడతాయి. ఈ ముళ్ల చివర్ల ద్వారానే ఇవి ఆ చుట్టుపక్కల ఉండే కాంతిని గ్రహించగలవని, తద్వారా పరిసరాలపై అవగాహన ఏర్పరచుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నింటిలో ఈ ముళ్లు విషపూరితం కూడా. ఇవి ఒకేసారి 2 కోట్ల గుడ్లు పెట్టగలవు. కొన్ని దేశాల్లో ఈ గుడ్లకు భలే గిరాకీ ఉంది.
- ===================================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...