సముద్రంలో ఓ చిన్నదీవి.. మనుషుల జనాభా 1600.. ఎర్రపీతలు కూడా ఉంటాయి.. ఎన్నో తెలుసా? దాదాపు 15 కోట్లు! ఏటా ఇవి ఓ విన్యాసం చేస్తాయి.. అది ప్రపంచంలోనే అద్భుతమైనది!
లెఫ్ట్.. రైట్.. లెఫ్ట్.. రైట్..! సైనికులు ఒకే విధంగా కవాతు చేస్తుంటే ఎంత బాగుంటుందో కదూ? ఆ దీవిలో ఎర్రపీతలు కూడా ఇలాగే ఒకే లక్ష్యంతో బయల్దేరుతాయి. వాటి ప్రయాణం 'ప్రపంచంలోనే ఆశ్చర్యకరమైన వలస విన్యాసం'గా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఈ పీతల మహాప్రయాణం ఎక్కడికో తెలుసా? సముద్ర తీరానికి. అక్కడవి గుడ్లు పెడతాయి. ఒకో పీతా లక్ష వంతున!
ఇంతకీ ఆ దీవి ఎక్కడుందో తెలుసా? హిందూ మహాసముద్రంలో. పేరు క్రిస్‌మస్ దీవి. ఆస్ట్రేలియా ఆధీనంలో ఉండే దీని వైశాల్యం కేవలం 50 చదరపు మైళ్లు. ఈ దీవిలో జనాభా 1600 మందయితే, పీతల సంఖ్య 15 కోట్లు. అంటే పీతలన్నింటినీ మనుషులకు పంచిపెడితే ఒకొక్కక్కరికీ 93,750 పీతలొస్తాయన్నమాట! ఈ పీతలన్నీ ఆ దీవిలోని అడవుల్లో ఉంటాయి. నేలల్లో బొరియలు చేసుకుని ఆకులు, విత్తనాలు, పండ్లు తింటూ కాలక్షేపం చేస్తాయి. సరిగ్గా అక్టోబర్-నవంబర్ నెలల మధ్య ఏదో పనున్నట్టు బొరియల్లోంచి బిలబిలలాడుతూ బయల్దేరుతాయి. అక్కడి నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరముండే సముద్ర తీరమే వాటి లక్ష్యం. ఆ ప్రయాణంలో అవి ఎత్తుపల్లాలు, ఇల్లు, భవనాలు, రోడ్లు, ఏవి అడ్డొచ్చినా ఆగవు. గునగునా.. చకచకా నడుస్తూ పోతాయి. ఆ సమయంలో ఆకాశంలోంచి చూస్తే ఎక్కడ చూసినా ఎర్ర తివాచీలు పరిచినట్టు కనిపిస్తుంది.
సముద్ర తీరానికి చేరుకోగానే ఏం చేస్తాయి? మగ పీతలు చకచకా బొరియలు చేస్తాయి. ఆడవి అందులో దూరుతాయి. అన్నీ జతకట్టాక ఆడవక్కడ ఉండిపోతే మగవి తిరిగి అడవుల్లోకి పోతాయి. ఆడ పీతలు సముద్ర జలాల్లో గుడ్లు పెట్టేసి వెనక్కి వచ్చేస్తాయి. ఆ గుడ్లు లార్వాలై, పిల్లలయ్యాక సుమారు 5 మిల్లీమీటర్లుండే ఆ బుల్లి ఎర్ర పీతలు కూడా అడవుల దిశగా పొలోమంటూ పోతాయి.
ఆ దీవిలో రెడ్‌క్రాబ్స్‌గా పిలిచే ఇవి సుమారు 40 మిల్లీమీటర్ల పరిమాణానికి ఎదుగుతాయి. వీటికి ఆ దీవిలో ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడిందిట. ఆఫ్రికాలో ఉండే ఎల్లోయాంట్స్ అనే చీమలు ఇక్కడికెలాగో వచ్చి చేరాయి. ఇవి పాపం.. ఈ ఎర్ర పీతలపై దాడి చేసి తినేస్తున్నాయి. ఇలా ఇవి ఇప్పటికే దాదాపు 2 కోట్ల పీతల్ని చంపేసినట్టు అంచనా. అక్కడి ప్రభుత్వం ఈ పీతల ప్రయాణానికి రోడ్ల కింద నుంచి సొరంగాలు తవ్వడం, రోడ్ల మీద వాహనాల రాకపోకలు రద్దు చేయడం లాంటి చర్యలు చేపడుతోంది.
- ======================================================
http://dr.seshagirirao.tripod.com/
No comments:
Post a Comment
your comment is important to improve this blog...