Saturday, March 13, 2010

ఎలిఫేంట్‌ సీల్ కధ ఏమిటి?, Elephant Seal Story?




ఏనుగు తొండంలాంటి ముక్కు.. నాలుగువేల కిలోల బరువు.. 20 అడుగుల పొడవు.. ఈ జీవి పేరు.. ఎలిఫేంట్‌ సీల్‌ దీని గురించి కొత్త విషయం బయటపడింది..

సముద్ర జీవులెన్నో పిల్లల్ని పెట్టడానికో, లేదా కాలం మారినప్పుడో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళతాయని తెలుసుకదా! అలాగే ఎలిఫేంట్‌సీల్‌లు కూడా శీతాకాలం వచ్చేసరికి ప్రతి ఏడాది కాలిఫోర్నియా నుంచి అలస్కా తీరానికి పసిఫిక్‌ సముద్రం మీదుగా వలస వెళతాయి. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయో తెలుసా? 2000 నుంచి 3000 కిలోమీటర్లు. సుమారు రెండు నుంచి ఎనిమిది మాసాల వరకు సముద్రంలో ఈదుతూనే ఉంటాయి. మరి ఇవి అలసిపోవా? ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి? ఎప్పుడు నిద్రపోతాయి? ఈ సందేహాలన్నీ శాస్త్రవేత్తలకు వచ్చాయి. ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడం కోసం పెద్ద పరిశోధనే చేశారు.

జపాన్‌లోని టోక్యోలోని శాస్త్రవేత్తలు ఆరు ఎలిఫేంట్‌ సీల్స్‌ని తీసుకుని వాటి వీపులకి ఎలక్ట్రానిక్‌ టాగ్‌లు కట్టారు. అవి ఉపగ్రహాలతో అనుసంధానమై ఉంటాయి. అందువల్ల సీల్స్‌ ఎంత వేగంతో, ఎంత లోతులో ఈదుతున్నాయి, ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? వాటి ప్రయాణ మార్గం ఎలా ఉంది, ఇలా అన్ని వివరాలూ ఎప్పటికప్పుడు నమోదై ఉపగ్రహాలకి ప్రసారం అవుతుంటాయి. అవి తిరిగి పరిశోధకులకు అందుతాయి. కంప్యూటర్లలో ఆ సమాచారాన్ని విశ్లేషించి వివరాలు సేకరిస్తారు. ఇలా పరిశోధించేసరికి కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు బయటపడ్డాయి.

ఎలిఫెంట్‌ సీల్స్‌కి అలసట వస్తే వెల్లకిలా తిరిగి అలా ఉండిపోతాయి. ఈదడం ఆపేయడం వల్ల అవి నెమ్మదిగా లోతుల్లోకి జారిపోవడం మొదలుపెడతాయి. ఎలాగో తెలుసా? గుండ్రంగా తిరుగుతూ. చెట్టు మీద నుంచి పడే ఆకు గిరగిరా తిరుగుతూ పడినట్టన్నమాట. అదే వాటి విశ్రాంతి. అలా కాసేపు కావాలని మునిగిపోయాక చటుక్కున లేచి ఓసారి ఒళ్లు విరుచుకుని జామ్మంటూ ఈదడం మొదలెడతాయి. సాధారణంగా డాల్ఫిన్లు, తిమింగలాలు లాంటి సముద్రపు క్షీరదాలు ఈదుతూనే నిద్రపోగలవు. వాటి మెదుడులో సగభాగం విశ్రాంతి తీసుకుంటే, రెండో భాగం పని చేస్తూఉంటుంది. వీటికి భిన్నంగా ఎలిఫెంట్‌ సీల్స్‌ ప్రవర్తిస్తాయన్నమాట. భలే ఉంది కదూ!

*ప్రపంచంలో ఉన్న సీల్‌ చేపలన్నింటిలో ఎలిఫేంట్‌ సీల్‌ పెద్దది. వీటిలో రెండు జాతులు ఉన్నాయి.
*ఇవి పిల్లల్ని కనడానికి మాత్రమే భూమి మీదకి వస్తాయి.
*ఒకసారి ఊపిరి పీల్చుకుంటే రెండు గంటలపాటు సముద్రంలో ఈదగలవు.
*చర్మం దళసరిగా ఉండడం వల్ల ఎంత చలినైనా తట్టుకోగలవు.
  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...