Wednesday, March 10, 2010

వెక్కిళ్లు ఎందుకొస్తాయి? , Hiccoughs for somebody Why?




ప్రశ్న: మనకు వెక్కిళ్లు ఎందుకు వస్తాయి?

జవాబు: మన దేహంలోని ఛాతీ, ఉదర భాగాల్ని వేరు చేసే పలుచని విభాజకం ఒకటుంటుంది. దీనిని ఉదర వితానం (diaphragm) అంటారు. ఇది కిందికి కదిలితే ఛాతీ ఎక్కువ గాలిని నింపుకుంటుంది. పై వైపు కదిలితే ఛాతీలోని కొంత గాలి బయటకు పోతుంది. మనం ప్రతిసారీ ముక్కు ద్వారా గాలిని పీల్చి, వదులుతున్నప్పుడు ఉదరవితానం కిందికీ పైకీ కదులుతూ ఉంటుంది. ఆ విధంగా మనం నిశ్శబ్దంగా శ్వాసిస్తూ ఉంటాం.

శ్వాసించడం అనేది లయబద్ధంగా జరిగే క్రమమైన ప్రక్రియ. కాబట్టి శ్వాసనాళిక లోపలికి, వెలుపలికి వచ్చే గాలి నిశ్శబ్దంగా స్వర పేటికలోకి ప్రవేశిస్తుంది. ఒకోసారి ఉదరవితానానికి అంటుకుని ఉండే నరం ఉత్తేజితమైతే ఉదరవితానం తటాలున కుంచించుకుపోయి కింది వైపు కదులుతుంది. అప్పుడు శ్వాసనాళం పై చివర అంటే స్వర పేటిక మూసుకోవడం మొదలవుతుంది. ఆ దశలో దాని ద్వారా హడావుడిగా వెలుపలికి పోయే గాలి, సీసా మూతిని బిగించిన రబ్బరు బిరడాను గబుక్కున లాగితే వచ్చే 'పక్‌' (యాక్‌) లాంటి శబ్దం చేస్తుంది. అలాంటి శబ్దాలు మధ్యమధ్య కొంత కాల వ్యవధిలో వరసగా వస్తాయి. అవే వెక్కిళ్లు. కారం ఎక్కువగా ఉండే మసాలా పదార్థాలు తినడం, కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడం, పేగులు సరిగా పనిచేయక పోవడం లాంటి కారణాల వల్ల ఉదరవితానానికి అంటుకుని ఉండే నరం ఉత్తేజితమై వెక్కిళ్లు వస్తాయి.
  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...