ఓసారి పీతను తల్చుకోండి. ఎంతుంటుంది? మహా అయితే అరచెయ్యంత అనబోతున్నారా? అయితే ఆగండి. ఏకంగా ఆరడుగుల పొడవుండే పీత ఒకటుందని తెలుసా! అదే కోకోనట్ క్రాబ్. మరి పేరులో కొబ్బరెందుకో వూహించగలరా? ఈ మహా పీత గారు చకచకా కొబ్బరి చెట్టెక్కేసి, అక్కడున్న కాయని చీల్చి మరీ తినేస్తుంది. దీనికుండే పది కాళ్లలో ముందరుండే రెండూ బలంగా, పొడవుగా, కత్తెరలాంటి కొండెలతో ఉంటాయి. వాటితో ఇది పచ్చి కొబ్బరి కాయ లోపలి కంటా చిల్లు చేసి, అందులో గుజ్జునంతా జుర్రుకోగలదు.
కొబ్బరి చెట్లు పెరిగే సముద్ర తీర ప్రాంతాల్లోనే బతికే ఇవి ప్రపంచంలోనే పెద్ద పీతలు. అందుకే ఒకోటీ ఆరడుగుల పొడవుతో ఏకంగా 17 కిలోల బరవు వరకూ పెరుగుతాయి. అన్నట్టు.. దీనికి మరో పేరు కూడా ఉంది. అదేంటో తెలుసా? దొంగపీత! దీన్ని ఆయా ప్రాంతాల వారు రాబర్ క్రాబ్ (Robber Crab) అంటారు. ఎందుకో తెలుసా? ఇవి తీరం దగ్గరుండే ఇళ్లు, గుడారాలలోకి దూరి చిన్న కుండల్లాంటి మట్టి పాత్రల్ని, మెరిసే వెండి వస్తువుల్ని ఈడ్చుకుని పోతుంది. ఎందుకో ఎవరికీ తెలీదు. బహుశా తినేవనుకుంటుందో ఏమో!
రాత్రి మాత్రమే సంచరించే వీటి జీవనం కూడా చిత్రమే. ఆడ పీతలు సముద్రంలో గుడ్లు పెడితే, అవి నీటిలో లార్వాలుగా మారతాయి. ఆపై అవి నీటి అడుక్కి చేరి వేరే జీవుల గుల్లల్లో చేరతాయి. దానంత ఎదిగాక ఇంకా పెద్ద ఆల్చిప్పలాంటి గుల్లను ఎంచుకుంటాయి. ఇలా కొంత కాలం అయ్యాక ఇక పూర్తిగా భూమి మీదకి వచ్చేస్తాయి. ఒక దశ వచ్చాక వీటి మొప్పలు, ఊపిరితిత్తుల్లాగా పనిచేయడంతో ఇక నీటిలో శ్వాసించలేవు. భూమ్మీదకి వచ్చాక కొబ్బరి చిప్పల్ని మోసుకుంటూ కొన్నాళ్లు తిరుగుతాయి. శరీరం గట్టి పడ్డాక దాన్ని వదిలేసి చకచకా విహరిస్తాయి. తీరాల్లో బొరియలు చేసుకుని, అందులో కొబ్బరి పీచును పరుచుకుని కాలక్షేపం చేస్తుంటాయి. కేవలం కొబ్బరి గుజ్జునే కాకుండా పళ్లు, ఆకులు, తాబేళ్ల గుడ్లని కూడా లాగిస్తాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వీటిని వండుకుని తింటారు. వీటి ధర కూడా ఎక్కువే.
- ===========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...