గుమ్మడికాయలాంటి గుండ్రటి తలకాయ. బానలాంటి పేద్ద బొజ్జ. ఎప్పుడూ సంతోషంగా కనిపించే ముఖం. చూస్తేనే నవ్వుపుట్టే ఆకారం. ఈ వర్ణనంతా ఎవరి గురించో తెలుసా? లాఫింగ్‌బుద్ధా. ఇతడి గురించి చైనా, జపాన్, థాయ్‌లాండ్‌లతో పాటు మన దేశంలో కూడా ఆసక్తి కరమైన కథలున్నాయి తెలుసా?
హ్యాపీ బుద్ధా, బుదాయి, కైసీ, మైత్రేయి ఇలా రకరకాల పేర్లు ఉండచ్చు కానీ దేశదేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోలెడంత గుర్తింపు. ఇంతకీ ఎవరితడు? చైనా కథ ప్రకారం ఇతడి అసలు పేరు హొటై. సుమారు వెయ్యేళ్ల క్రితం నివసించిన బౌద్ధ బిక్షువు. భుజాన జోలె, చేతిలో బిక్షాపాత్రతో తిరుగుతుండే ఇతడికి ఎన్ని మహిమలో. తెలియని వారికి ఒట్టి బిచ్చగాడే కానీ, తెలిసిన వారికి ఆపద్బాంధవుడే. పేదవారికి, పిల్లలకి జోలె లోంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడు. ఎన్ని మిఠాయిలు, ఎన్ని తినుబండారాలు పంచి పెట్టినా జోలె ఖాళీ అయ్యేదే కాదు. అంటే అది అక్షయపాత్ర అన్నమాట. ఇతడిని చూసినవాళ్లకు ఆ రోజంతా హాయిగా, ఆనందంగా గడిచిపోయేదట.
ఇక జపాన్‌లో లాఫింగ్‌బుద్ధా ఏడుగురు అదృష్ట దేవతల్లో ఒకడు. మన దేశం కథల ప్రకారం చూస్తే సాక్షాత్తూ బోధిసత్త్వుడి అవతారమే. సంస్కృతంలో ఇతని పేరు మైత్రేయ. అంటే భవిష్యత్తు బుద్ధుడని అర్ధం. ఇతని విగ్రహం ఎక్కడుంటే అక్కడ సుఖసంతోషాలు, సిరిసంపదలు తులతూగుతాయనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.
థాయిలాండ్‌లో మరో చిత్రమైన కథ ఉంది. సంకాజాయ్ అనే ఓ సాధువు చాలా అందంగా ఉండేవాడట. ఇతడిని చూసి మగవాళ్ళు కూడా మైమరచిపోయేవారట. ఇది నచ్చని అతడు కావాలనే తన రూపాన్ని పెద్ద బొజ్జతో, లావుగా మార్చుకున్నాడని చెబుతారు. ఇతనికి ఆ దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. హొటెపై భలే నమ్మకాలున్నాయి తెలుసా? కుండలాంటి ఇతని పొట్ట మీద రాస్తే అదృష్టం వరిస్తుందంటారు. ఎందుకంటే సకల సిరిసంపదలన్నీ ఆ బొజ్జలోనే ఉన్నాయిట మరి. ఇక లాఫింగ్ బుద్ధా విగ్రహాల్లో ఎన్ని రకాలో. ఒకోదాని వెనక ఒకో నమ్మకం కనిపిస్తుంది.
మీకు తెలుసా?
అంతర్జాతీయ వేలంలో ఒక లాఫింగ్‌బుద్ధా బొమ్మ ఏకంగా 10 లక్షల డాలర్ల ధర పలికింది!
- ===========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...