Sunday, November 09, 2014

Sea water change to drinking water?,సముద్రపు నీటిని మంచినీరుగా మార్చగలమా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న : సముద్రపు నీటిని మంచినీరుగా మార్చగలమా?

జవాబు: కోట్లాది సంవత్సరాలుగా వర్షపు నీరు నదుల్లోనూ, వర్షపాత ప్రాంతాల్లోనూ ఉన్న వివిధ లవణాలను మోసుకెళ్లి సముద్రంలో కలపడం వల్ల సముద్రపు నీరు ఉప్పుమయం అయ్యింది. సముద్రపు నీరు తాగు, సాగునీరుగా పనికిరాదు. ఇలాంటి నీరు తాగితే జీర్ణవాహిక పొడవునా ఉన్న కణాల్లోని నీరు ద్రవాభిసరణం (Osmosis) ద్వారా తాగిన ఈ ఉప్పు నీళ్లలో కలుస్తుంది. తద్వారా జీర్ణవాహిక తన నిర్మాణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పైగా సముద్రపు నీటిలో ఉన్న కొన్ని నిరింద్రియ లవణాలు రక్తంలో కలిస్తే మన జీవ భౌతిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. వ్యవసాయానికి ఈ నీరు పారితే పొలంలో ఉన్న సారాన్ని హరించి వేస్తాయి. పంటలు సరిగా పండవు.

సముద్రంలో ఉన్న నీటి మొత్తాన్ని మంచినీరుగా మార్చడం వీలుకాదు. కానీ సముద్రపు నీటిని తక్కువ మోతాదులో 'రివర్స్‌ ఆస్మోసిస్‌' ద్వారా మంచి నీటిగా మార్చగలం. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని. అయితే రివర్స్‌ ఆస్మాసిస్‌, స్వేదన ప్రక్రియల ద్వారా ఉప్పునీటిని మంచినీటిగా మార్చే అవకాశం శాస్త్రీయంగా ఉంది.

మనం తాగే నీరు, సాగు నీరు వర్షాల నుంచి వచ్చిందే. వర్షాలు సముద్రపు నీటి నుంచి వచ్చే మేఘాల నుంచే కాబట్టి సముద్రంపై నీరు పరోక్షంగా ప్రకృతి వరప్రసాదంగా, మంచి నీరుగా మారినట్టే కదా!

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,-జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===================================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...