Thursday, November 20, 2014

Magnatic Trains move -మాగ్నటిక్‌ రైళ్లు చక్రాలు లేకుండానే ఎలా నడుస్తాయి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: మాగ్నటిక్‌ రైళ్లు చక్రాలు లేకుండానే ఎలా నడుస్తాయి?

జవాబు: మామూలు రైళ్లు పట్టాల మీద ఆనడం వల్ల పట్టాలకు రైలు చక్రాలకు మధ్య ఏర్పడిన ఘర్షణను చక్రం తిరగడం ద్వారా అధిగమిస్తారు. అందుక్కావలసిన శక్తిని ఇంధనం ద్వారా లేదా సరాసరి విద్యుత్తు ద్వారా పొందుతారు. చక్రాలు గుండ్రంగా ఉండటం వల్ల పట్టాలకు ఆనిన భాగం స్వల్పంగానే ఉంటుంది. ఘర్షణ అనేది మనకు ఆటంకం. దాని విలువ అంటుకొని ఉన్న వస్తువుల మధ్య అంటుకున్న వైశాల్యాన్ని బట్టి పెరుగుతుంది. చక్రాలు పట్టాలకు తాకిన ప్రాంతపు వైశాల్యం తక్కువగా ఉండటం వల్ల ఘర్షణ బలం కొంతలో కొంత తగ్గినట్టే.

కానీ బండి జరగాలంటే చక్రం తిరగాలి. అందుకోసమే శక్తి అవసరం. మాగ్నటిక్‌ రైళ్లలో రైలు బండి చక్రాల ఆధారంగా పట్టాల మీద నిలబడదు. రైలు పట్టాలకు రైలు బండి అడుగున ఉన్న చక్రాల స్థానే ఉన్న పట్టీలకు ఒకే ధృవత్వం ఉన్న అయస్కాంత తత్వాన్ని విద్యుశ్చక్తి ద్వారా ఏర్పరుస్తారు. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయని మీరు చదువుకున్నారు. పట్టాల అయస్కాంత ధృవత్వం, రైలు అడుగున ఉన్న విద్యుదయస్కాంత పట్టీల అయస్కాంత తత్వం ఒకేవిధంగా ఉండటం వల్ల ఏర్పడిన వికర్షణ రైలు మొత్తంగా పట్టాల నుంచి కొన్ని మిల్లిమీటర్ల మేరపైకి తీస్తుంది. దీన్నే అయస్కాంత ఉత్‌ప్లవనం అంటారు. ప్రత్యేక పద్ధతిలో పట్టాలకు, పట్టీలకు మధ్య ఏర్పడిన వికర్షణ బలాన్ని మార్చడం ద్వారా రైలు ముందుకు వెళ్లేలా ఏర్పాటు ఉంటుంది. మామూలు రైలు పట్టాల్లాగా ఈ మాగ్నటిక్‌ రైలు బండి పట్టాలు సాఫీగా అవిచ్ఛిన్న రేఖలాగా కాకుండా విచ్ఛిన్నంగా ఉండటం వల్ల ఇలా చలనం వీలవుతుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ==========================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...