- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: కొన్నాళ్ల క్రితం శాస్త్రవేత్తలు దైవకణం కనుగొన్నారని విన్నాము. అసలా కణం ఏమిటి?
జవాబు: సుమారు 13 బిలియన్ల సంవత్సరాల క్రితం సంభవించిన బిగ్‌బ్యాంగ్ (మహా విస్ఫోటం) వల్ల మన విశ్వం ఏర్పడిందని శాస్త్రవేత్తల అంచనా. పీటర్ హిగ్స్ అనే బ్రిటిష్ కణ భౌతిక శాస్త్రవేత్త ప్రకారం అలా ఏర్పడిన విశ్వం మొత్తాన్ని కంటికి కనిపించని ఒక అపూర్వశక్తి స్వరూపం ఆవరించుకుని ఉంది. ఈ క్షేత్రమే విశ్వంలో ఉండే ద్రవ్యం (matter)లోని మౌలిక కణాలతో సంపర్కం చెందడంతో 'హిగ్ బోసాన్లు' అనే కణాలు ఏర్పడ్డాయి. ఇవే పదార్థాలలో ఉండే పరమాణువుల నిర్మాణానికి దోహదపడే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు మొదలైన కణాలకు ద్రవ్యరాశి (mass)ను సమకూరుస్తాయి. ఆ ద్రవ్యరాశి లేకపోతే అణువులూ, పరమాణువులూ ఏవీ లేవు. నక్షత్రాలు, గ్రహాలు అంటూ ఏవీ ఏర్పడేవి కావు. జీవం అంటే ప్రాణికోటి మనుగడే లేదు. అసలు విశ్వమే లేదు. ఆ విధంగా సృష్టిలోని ప్రతి అణువుకూ నారూ నీరూ పోస్తున్న ఈ అద్భుత కణం 'హిగ్‌బోసాన్'ను శాస్త్రవేత్తలు దైవకణం (God Particle) అన్నారు.
గ్రాములో ఐదువేల బిలియన్ బిలియన్ బిలియన్ల వంతు ఉండే ఈ కణాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దులోని భూగర్భంలో పదేళ్ల పాటు శ్రమించి ప్రపంచంలోనే పెద్దదైన, ఖరీదైన 'లార్జ్ హార్డాన్ కొలైడర్' అనే యంత్రాన్ని నిర్మించారు. ఈ యంత్రంలో కాంతి వేగంతో పయనించే ప్రోటాన్లు ఒకదానికొకటి ఢీకొని విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా ఉత్పన్నమయ్యే అతి సూక్ష్మకణాల నుంచి శాస్త్రవేత్తలు దైవకణాన్ని గుర్తించారు. ఆ సమయంలో ఆ కణాన్ని ప్రతిపాదించిన పీటర్‌హిగ్స్ అక్కడే ఉండడం విశేషం!
ఈ ప్రయోగం ద్వారా బిగ్‌బ్యాంగ్ నాటి పరిస్థితులను తిరిగి ప్రయోగశాలలో సృష్టించడమే కాకుండా ఇప్పటికీ శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్న కృష్ణద్రవ్యం (Dark matter), కృష్ణబిలాలు(Black holes) గురించి సాధ్యమైనన్ని వివరాలన్నో తెలుసుకోవచ్చు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...