ప్రశ్న: వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఆన్ చేసినప్పుడు దుమ్ము, ధూళి అన్నీ అందులోకి వెళ్లిపోతాయి. ఇదెలా సాధ్యం?
జవాబు: కూల్‌డ్రింక్ సీసాలో స్ట్రాను పెట్టి పీల్చితే ఏం జరుగుతుందో వ్యాక్యూమ్ క్లీనర్‌లో కూడా అదే జరుగుతుంది. స్ట్రాను పీల్చినప్పుడు అందులోని మొత్తం గాలి ఖాళీ అవడం వల్ల అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ప్రదేశంలోకి బయటి గాలి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నంలో సీసాలోని కూల్‌డ్రింక్‌ను కూడా అందులోకి తోస్తుంది. అలా డ్రింక్ నోట్లోకి చేరుతుంది. గాలి ఎక్కువ పీడనం ఉన్న ప్రదేశం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి ప్రవహిస్తుందనే సూత్రం ఇందులో ఇమిడి ఉంది. విద్యుత్ శక్తితో పనిచేసే వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఆన్ చేసినప్పుడు అందులోని మోటారు పనిచేసి ఒక ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది. అది క్లీనర్ గొట్టంలో ఉండే గాలిని బయటకు పంపేస్తుంది. ఫలితంగా అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి బయట ఉండే గాలి వేగంగా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ గాలితో పాటే అక్కడ ఉండే దుమ్ము, ధూళి లోపలికి చేరడంతో ఆ ప్రదేశం శుభ్రపడుతుంది. అలా వ్యాక్యూమ్ క్లీనర్ లోపలికి చేరిన వ్యర్థాలను ఆ తర్వాత దులిపేసి తిరిగి దానిని వాడకానికి సిద్ధంగా ఉంచుతారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...