ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: ప్రపంచంలోని అందరూ కూడబలుక్కుని ఒక్కసారిగా పైకెగిరి దూకితే భూమి తన కక్ష్య నుండి తప్పుకుంటుందా?
జవాబు: భూమి సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరగడానికి కారణం సూర్యుడు భూమిని ఆకర్షించడం, భూమికి గల ద్రవ్యవేగం (momentum). ఒక వస్తువు ద్రవ్యవేగం దాని ద్రవ్యరాశి(mass), వేగం (velocity) పై ఆధారపడి ఉంటుంది. భూమి ద్రవ్యరాశి ఎంత అధికంగా ఉంటుందంటే దానిపై ఉండే వస్తువుల ద్రవ్యరాశిలోని మార్పులు, చేర్పులు దానిపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. అంటే దాని ద్రవ్యరాశిలో కానీ, వేగంలో కానీ ఎలాంటి మార్పులు ఏర్పడవు. అంతేకాకుండా న్యూటన్ మొదటి గమన సూత్రం ప్రకారం ఒక వస్తువు గమనంలో మార్పు తీసుకురావాలంటే ఆ వస్తువుపై బలాన్ని (force) ప్రయోగించాలి. ఇది బాహ్య బలమై ఉండాలి. అంటే వస్తువు వెలుపల నుండి కలగాలి. గమనంలో ఉన్న బస్సులోని ప్రయాణికులు వారి ముందుండే సీట్లను బలంగా నెట్టడం ద్వారా బస్సు వేగాన్ని పెంచలేరు కదా. అలాగే భూమి ఉపరితలం నుండి దాని గురుత్వాకర్షణ శక్తి పనిచేసే 'పై వాతావరణం' వరకు ఒక సంవృత వ్యవస్థ (closed entity) మొత్తాన్ని ఒక బస్సులాగా ఉహిస్తే, అందులోని ప్రాణుల, వస్తువుల కదలికలు భూమి గమనంలో ఏ మార్పునూ తీసుకురాలేవు. అందువల్ల భూమిపై ఉండే మనుషులందరూ ఒకేసారి పైకెగిరి దూకినా ఏమీ జరగదు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...