- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న:మొత్తం విశ్వం వయసెంత? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు ఈ విశ్వం ఉంటుంది?
జవాబు: విశ్వం ఆవిర్భావం గురించి చాలా వాదనలు ఉన్నాయి. అన్నింటికీ ఎంతో కొంత శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మూడు. అవి: 1. స్టడీ స్టేట్ థియరీ (Steady State Theory) 2. ఆస్లేటింగ్ థియరీ (Oscillating Theory) 3. బిగ్‌బ్యాంగ్ థియరీ(Big Bang Theory).
ఈ మూడింటిలో అత్యధిక శాస్త్రీయ రుజువులున్న మహావిస్ఫోట సిద్ధాంతం (బిగ్‌బ్యాంగ్) ప్రకారం మనం ఉన్న ఈ విశాల విశ్వం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం కేవలం ఓ రాగిగింజ కన్నా తక్కువ పరిమాణంలో ఉండేది. అది ఒక్కపెట్టున పేలిపోయి అత్యధిక సాంద్రతర రూపం నుంచి చెల్లాచెదురై మొదట చాలా చిన్న చిన్న ప్రాథమిక కణాల (fundamental particle) వాయువుగా ఉండేది. ఆ కణాలు తిరిగి పునర్వ్యవస్థీకరించుకునే క్రమంలో పరమాణువులు, అణువులు, ఘన, వాయు, ద్రవ రూపాలుగా ఉన్న పదార్థాల మయమైన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలుగా రూపొందాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్యం వ్యాకోచిస్తూ ఉంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. అయితే హరాత్మక విశ్వ సిద్ధాంతం(oscillating universe Theory ప్రకారం విశ్వం సంకోచవ్యాకోచాల మయం. సంకోచించి చిన్న రూపమైనందువల్లే మహావిస్ఫోటం జరిగిందని దీని వాదన. కాబట్టి ఇది వ్యాకోచించి ఆ తర్వాత తిరిగి గురుత్వాకర్షణ(gravitational forces) వల్ల దగ్గరై మళ్లీ మరో విస్ఫోటానికి దారి తీస్తుంది. ఇక స్టడీ స్టేట్ థియరీ ప్రకారం ఈ విశ్వానికి ఆది, అంతం అంటూ ఏమీ లేవు. వివిధ గతులు, దశలు (Stages and Phases) ఉంటాయి. ఒక గతిలో కొంత కాలం ఉంటుంది. అది ఒక దశ. అది కొనసాగి మరో గతికి చేరుకుని అక్కడ మళ్లీ కొంత కాలం సాగుతుంది. ఇది మరో దశ. ఇలా పదే పదే దశలు, గతులు మార్చుకుంటూ అవిశ్రాంతంగా అనాదిగా, అనంతంగా ఈ విశ్వం కొనసాగుతుంది. అలాంటి గతి మార్పుల్లో ఒకటే మహావిస్ఫోటమనేది ఈ సిద్ధాంతం వాదన. నేడు శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది ఈ సిద్ధాంతానికే మద్దతు తెలియజేస్తున్నారు. ఇదే నిజమైతే మన విశ్వం ఇంకెంత కాలమైనా ఉంటుంది.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...