ప్రశ్న: ఏసి యంత్రం నుంచి గాలి చల్లగా ఎలా వస్తుంది? ఆ గాలి ఆరోగ్యానికి మంచిదేనా?
జవాబు: వాయువుల్లో వాస్తవ వాయువులు (Real Gases) ఆదర్శ వాయువులు(Ideal Gases) అనే రెండు రకాలున్నాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని పరస్పరం మార్చుకోవచ్చును. ఇందులో వాస్తవ వాయు ధర్మాల్లో ఓ ప్రధాన ధర్మం జౌల్ థామ్సన్ గుణకం. ఓ వాయువును బాగా సంపిలినీకరణం (Compression) చేశాక ఒక్కసారిగా విరళీకరణా(expansion)నికి గురిచేస్తే ఆ వాయువు ఉష్ణోగ్రత పడిపోయే ధర్మానికి జౌల్ థామ్సన్ గుణకం ఓ కొలబద్ద. ఇది క్లోరో ఫ్లోరో కార్బన్ బృందానికి చెందిన ఫ్రియాన్ వాయువుకు చాలా ఎక్కువ. అందుకే ఏసీ యంత్రాల తయారీలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ప్రత్యేక మోటారుతో మొదట ఫ్రియాన్ వాయువును అధిక పీడనానికి లోను చేస్తారు. అలా అధిక పీడనంలో ఉన్న ఫ్రియానును జల్లెడలాగా అంటే గొట్టాల చట్రంలోకి విస్తరించినపుడు ఆ గొట్టాలు చల్లబడతాయి. ఆ గొట్టాల మీదుగా గాలి పదేపదే చక్రీయంగా (Cyclically) వెళ్లేలా చేయడం వల్ల గదిలో గాలి క్రమేణా కూడా చల్లబడుతుంది. ఏసీ యంత్రాలు, రిఫ్రిజరేటర్లు పనిచేసేది ఈ యంత్రాంగం ఆధారంగానే. ఏసీ గాలి వల్ల ప్రమాదం ఏమీ లేదు. ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఎటొచ్చీ ఫ్రియాన్ వాయువుతోనే ఉంది తంటా అంతా. ఇది వాతావరణంలోకి ఏమాత్రం లీక్ అయినా ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది. తద్వారా భూ వాతావరణానికి అనారోగ్యం కలుగుతుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...