ప్రశ్న: సిరాను బ్లాటింగ్ పేపర్ ఎలా పీల్చుకుంటుంది?
జవాబు: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ద్రవాలకు సంబంధించిన ఒక ధర్మాన్ని తెలుసుకోవాలి. ఒక కేశనాళిక (వెంట్రుకంత సన్నని రంధ్రం ఉండే గాజుగొట్టం)ను ఒక పాత్రలో ఉన్న నీటిలో నిలువునా ముంచితే ఒక విషయాన్ని గ్రహించవచ్చు. పాత్రలోని నీటి మట్టం కంటే కేశనాళికలోని నీటి మట్టం కొంచెం ఎత్తులో ఉంటుంది. అంటే పాత్రలోని నీరు కేశనాళికలోకి ఎగబాకిందన్నమాట. ద్రవాలకు ఉండే ఈ ధర్మాన్ని కేశనాళీయకత (capillarity) అంటారు. ద్రవాల ఉపరితలం, సాగదీసిన బిగువైన పొరలాగా ప్రవర్తిస్తుంది. దీన్నే ద్రవాల తలతన్యత (surface tension) అంటారు. కేశనాళీయకత అనేది ఈ తలతన్యత ప్రభావమే. ఇప్పుడు బ్లాటింగ్ పేపర్ విషయానికి వద్దాం. దీన్ని కొయ్య, ఎండుగడ్డి, దూది లాంటి పదార్థాల మెత్తని గుజ్జుతో తయారు చేస్తారు. ఈ గుజ్జును చదునైన తలంపై పోసి రోటర్లతో ఒత్తిడికి గురి చేయడం వల్ల
బ్లాటింగ్ పేపర్ తయారవుతుంది. ఈ పేపర్ కణాల మధ్య ఏర్పడే ఖాళీలు అతి సన్నని రంధ్రం గల గొట్టాలలాగా పనిచేస్తాయి. ఒలికిన సిరాపై బ్లాటింగ్ పేపర్‌ను సుతారంగా అద్దినప్పుడు కేశనాళీయకత వల్ల దాని ఖాళీల్లోకి సిరా ఎగబాకుతుంది. అలా ఆ కాగితం ఉపరితలంపైకి వచ్చిన సిరాను చుట్టుపక్కల కణాలు పీల్చుకోవడంతో అది వ్యాపిస్తుంది.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...