ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: వాషింగ్ మెషిన్‌లో వేసిన దుస్తుల జేబుల్లో పొరపాటున ఉండిపోయే కరెన్సీ నోట్లు చిరగవని అంటారు. ఎందువల్ల?
జవాబు: అన్ని సందర్భాలలోను ఇది వర్తించకపోయినా ఇందుకు ఒక కారణం ఉంది. నోట్ పుస్తకాలు, న్యూస్‌పేపర్‌కు వాడే మామూలు కాగితాలకు, కరెన్సీ నోట్ల తయారీకి ఉపయోగించే కాగితానికి మధ్య చాలా తేడా ఉంటుంది. మామూలు కాగితాలను చెట్ల నుంచి వచ్చే సెల్యులోజ్ పదార్థంతో తయారు చేస్తారు. కరెన్సీ నోట్లకు వాడే కాగితాన్ని పత్తి, ఊలు మిశ్రమంతో కూడిన లినెన్, గుడ్డ పీలికల నార నుంచి తయారు చేస్తారు. ఇందులో పోగులు చాలా దగ్గరగా బంధించబడి, మామూలు కాగితంలోని పోగుల కన్నా దృఢంగా ఉంటాయి. ఇవి నీటి వల్ల అంత త్వరగా ప్రభావితం కావు. సెల్యులోజ్‌తో చేసిన మామూలు కాగితం నీటిలో పడితే వెంటనే నీటిని పీల్చుకుని పోగులు విడిపోతాయి. దాంతో అది చిరిగిపోయి ఉండలు చుట్టుకుపోతుంది. కరెన్సీ నోట్లను నాణ్యమైన కాగితంతో చేయడం వల్ల అది అంత తొందరగా చిరిగిపోవు. అంతేకాకుండా మనం చేతులతో ఉతికినంత తీవ్రంగా వాషింగ్ యంత్రం దుస్తులను ఉతకదు. అది కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో దుస్తులను తిప్పడం ద్వారా వాటిలోని ధూళి కణాలను వేరు చేస్తుంది. ఇందువల్ల కూడా దుస్తుల జేబుల్లో ఉండిపోయిన కాగితాలు చిరిగిపోయేంత తీవ్రమైన ప్రభావానికి గురికావు.
- పొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...