ప్రశ్న: గోడకు నిలకడగా ఉన్న క్యాలెండర్ కాగితాలు సీలింగ్ ఫ్యాను వేయగానే రెపరెపలాడుతూ ముందుకు కదుల్తాయెందుకు? గాలి ఒత్తిడికి మరింతగా గోడకు అతుక్కుపోవాలి కదా?
-వైష్ణవి, అమలాపురం
జవాబు: ద్రవాలను, వాయువులను ప్రవాహకాలు (fluids)అంటారు. ఆ ప్రవాహకాల వల్ల కలిగే ఒత్తిడిని ఆ ప్రవాహపు ద్రవపీడనం అంటారు. నిలకడగా ఉన్న గాలి కన్నా కదిలే గాలి కలిగించే పీడనం ఎక్కువని భావించడం వల్లనే ఇలాంటి సందేహాలు ఏర్పడుతాయి. కానీ వేగం పెరిగే కొద్దీ గాలి పీడనం తగ్గుతుంది. దీనినే బెర్నేలీ సిద్ధాంతం అంటారు. ఈ సూత్రం ఆధారంగానే విమానాలు, హెలికాప్టర్లు, గాలిపటాలు, పక్షులు ఎగరగలుగుతున్నాయి. ఇప్పుడు క్యాలెండర్ విషయానికి వస్తే గదిలో ఫ్యాన్ వేయనప్పుడు గాలి పీడనం సాధారణంగా ఉంటుంది. ఫ్యాన్ వేయగానే గాలిలో కదలిక ఏర్పడి పీడనం తగ్గుతుంది. ఈ స్థితిలో క్యాలెండర్ కాగితాల ముందు కదిలే గాలి పీడనం కన్నా, ఆ కాగితాల వెనక ఉండే గాలి పీడనం ఎక్కువగా ఉంటుంది. గాలి కదలికల వల్ల క్యాలెండర్ ముందు భాగంలో అల్పపీడనం ఏర్పడి ఆ వెనక ఉన్న గాలి ముందుకు వస్తూ మధ్యలో ఉన్న కాగితాలను కూడా తోస్తుంది. అందుకే ఆ రెపరెపలు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...