ప్రశ్న: సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు నిర్జీవ పదార్థాలు కదా? వాటిలోకి మామూలు వైరస్ ఎలా ప్రవేశిస్తుంది?
ప్రశ్న: కంప్యూటర్‌లో వైరస్ వచ్చిందంటారు. అంటే ఏమిటి?
జవాబు: కంప్యూటర్ వైరస్ అంటే జీవుల్లో రోగాలు కలిగించే వైరస్ కాదు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు ఒక విధమైన యాంత్రిక సంకేతాలతో (machine language) నిర్దేశితమయ్యే విద్యుత్ ప్రేరణల ద్వారా పని చేస్తాయి. దీన్నే ప్రోగామ్ అంటారు. కంప్యూటర్ పరిభాషలో పట్టుకోడానికి, చూడడానికి వీలయ్యే భాగాలను హార్డ్‌వేర్ అంటారని, అలా వీలుకాని ప్రోగాములను సాఫ్ట్‌వేర్ అంటారని తెలిసే ఉంటుంది. సాఫ్ట్‌వేర్ అనే ఈ ప్రోగామే సెల్‌ఫోన్లకు, కంప్యూటర్లకు జీవం లాంటిది. కొంతమంది జులాయిలు ఇంటర్నెట్ ద్వారా మోసపూరిత ప్రవృత్తితో అవాంఛనీయమైన సాఫ్ట్‌వేర్‌లను సృష్టిస్తారు. ఇవి ఒక పరికరంలోంచి మరో పరికరంలోకి వ్యాప్తి చెందుతూ విస్తరిస్తాయి. ఇది చేరిన పరికరాలు ఆశించిన విధంగా కాకుండా అసంబద్ధంగా, అనర్థంగా పని చేస్తాయి. రోగాలను వ్యాప్తి చేసే వైరస్‌లు ఎలాగైతే ఒకరి నుంచి మరొకరికి సోకుతాయో అలాగే ఈ కంప్యూటర్ వైరస్‌లు కూడా వ్యాపిస్తాయి కాబట్టి ఆ పేరుతో వ్యవహరిస్తారు.
కంప్యూటర్లలోకి వైరస్ ఎలా వస్తుంది? మొదట అసలు వైరస్ ఎలా పుట్టింది?
జవాబు: మన శరీరంలోకి, బాక్టీరియాల కణాల్లోకి వెళ్లే వైరస్ వేరు, కంప్యూటర్ వైరస్ వేరు. మామూలుగా జలుబు, ఎయిడ్స్, హెపటైటిస్, మశూచి వంటి జబ్బుల్ని కలిగించే వైరస్‌లకు భౌతిక రూపం ఉంటుంది. వాటిని మనం సూక్ష్మదర్శినుల్లో చూడవచ్చు. కానీ కంప్యూటర్ వైరస్‌లకు భౌతిక అస్తిత్వం లేదు. అవి కేవలం చిన్న చిన్న కంప్యూటర్ ప్రోగ్రాములు. మనకు ఉపయోగపడే కంప్యూటర్ ప్రోగ్రాముల్లో దూరి తమను తాము పునరుత్పత్తి చేసుకునేలా లాజిక్ ఉండే తేలికపాటి కంప్యూటర్ ప్రోగ్రాములే వైరస్‌లు. మరి వీటికి వైరస్ అని పేరు ఎందుకు పెట్టారు? మనకు సంబంధించిన మన స్వంత జీవకణాల్లోకి జబ్బును కలిగించే వైరస్ దూరి తన లాంటి వైరస్‌లనే పదే పదే తయారు చేసేలా మన స్వంత జీవ కణాన్ని నియంత్రించేదే సాధారణ వైరస్. ఆ క్రమంలో మనం వ్యాధి గ్రస్తులు కావడం, మంచాన పడి పని చేయలేకపోతాం కదా! అలాగే మనకు కావాల్సిన కంప్యూటర్ ప్రోగ్రాముల్లోకి వివిధ పద్ధతులు (ఇంటర్నెట్ ద్వారా, ఫ్లాపీలు, ఫ్లాష్‌డ్రైవ్‌లు ఒక కంప్యూటర్ నుంచి తీసి మరో కంప్యూటర్‌కు కలిపి వాడటం) ద్వారా సంక్రమిస్తాయి. అసలు ప్రోగ్రాము పని తీరును అడ్డుకుంటాయి. కాబట్టి వీటిని వైరస్ అన్నారు. ఇంటర్నెట్, ఇ-మెయిల్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్‌కు మొబైల్ ఫోన్లకు వైరస్‌లు విస్తరిస్తున్నాయి. 1970లో ఈ కంప్యూటర్ వైరస్‌లు తయారయ్యాయి. అప్పట్నించి ఇప్పటి వరకు కంప్యూటర్ వైరస్‌ల దాడి అధికమవుతోంది. సుమారు లక్షకోట్ల రూపాయల మేర ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కంప్యూటర్ వైరస్‌ల వల్ల నష్టం కలుగుతోంది. వ్యాపార లాభాలకు, రహస్యాల్ని తెలుసుకునేందుకు, పోకిరీగాళ్లు, స్వార్థ పరులు కంప్యూటర్ వైరస్‌లను రూపొందిస్తారు. రకరకాల ఆకర్షణ పూరితమైన ప్రకటనల ద్వారా మన కంప్యూటర్లలో ప్రవేశపెడతారు. సమర్థవంతమైన యాంటి వైరస్ సాఫ్ట్‌వేర్ వాడటం ద్వారా వైరస్‌లను నియంత్రించగలం.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్,-శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...