ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్రశ్న: యుక్తవయసులోనే ముఖం మీద ఎక్కువగా మొటిమలు వస్తుంటాయి. ఎందుకు? వాటిని తగ్గించుకోవడం ఎలా?
-కె. అరుణ్, పి. మన్మథ, 9వ తరగతి, మారికవలస
జవాబు: మనిషి ఎదిగే క్రమంలో శరీరంలో ఎన్నో హార్మోన్లు ఉత్పత్తి అవుతూ వివిధ పాత్రలను పోషిస్తాయి. యుక్తవయసులో యాండ్రోజన్లు, ఈస్ట్రోజన్లు అనే హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతుంటాయి. శరీరాన్ని కాంతివంతంగా, నిగారింపుతో ఉంచడానికి చర్మం కింద ఉన్న తైలగ్రంథులు (sabacious glands) తైలాన్ని స్రవిస్తాయి. ఆ తైలం చర్మంపై పలుచని పొరలాగా ఏర్పడి చర్మానికి నిగారింపును ఇస్తుంది. ఈ తైలగ్రంథుల సాంద్రత శరీరంలో మిగతా భాగాల కన్నా ముఖచర్మంలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ తైలస్రావం తైల రంధ్రాల ద్వారా చర్మం మీదకు రావాలి. కానీ ఇవి చాలా సన్నగా ఉండడం వల్ల చాలా సార్లు ఈ తైలం బయటకు రాలేక చర్మం కింద పోగుపడుతుంది. ఇవే మొటిమలు (పింపుల్స్).
ముఖాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, మంచి నీళ్లతో, తేలికపాటి సబ్బులతో తరచు కడుక్కుంటూ ఉంటే, తైలగ్రంథులు సక్రమంగా పనిచేసి ఎప్పటికప్పుడు తైలం బయటకు వస్తుంటుంది. మొటిమల్ని పోగొడతాయంటూ మార్కెట్లో దొరికే లేపనాలు, పౌడర్లు ఆ పని చేయలేవు. ముఖ వ్యాయామాలు, పరిశుభ్రత మాత్రమే మొటిమలు రాకుండా కాపాడే శాస్త్రీయ పద్ధతులు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...