Thursday, October 20, 2011

బిగ్‌బెన్‌ గడియారం సంగతేమిటి ? , What about Bigben Clock?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


లండన్‌ అనగానే ఏం గుర్తొస్తుంది? బిగ్‌బెన్‌ గడియారం కదా... అదిప్పుడు ప్రమాదంలో పడింది! ఒక పక్కకి వాలిపోతోంది...మరి దాని వివరాలు తెలుసుకుందామా?

ఇటలీలోని పీసా టవర్‌ ప్రత్యేకత ఏమిటి? ఒక పక్కకి ఒరిగి ఉండడం కదా. అలాగే లండన్‌లోని బిగ్‌బెన్‌ గడియార స్తంభం కూడా ఒరిగిపోతోందని తేలింది. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన ఇది ఇలాగే ఒరిగిపోతూ ఉంటే కొన్నాళ్లకు కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. నిట్టనిలువుగా ఉండే దీని పైభాగం ఇప్పటికే ఒకటిన్నర అడుగుల మేరకు పక్కకు ఒరిగి కనిపిస్తోంది. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది?

బిగ్‌బెన్‌గా పేరొందిన ఈ గడియారం టిక్‌టిక్‌ మనడం మొదలై ఇప్పటికి 152 ఏళ్లయింది. ఇప్పటికి కూడా చక్కగానే పనిచేస్తోంది. భూమి నుంచి కొలిస్తే ఏకంగా 315 అడుగుల ఎత్తుగా ఉండే టవర్‌పై నాలుగు వైపులా నాలుగు పెద్ద పెద్ద గడియారాలు ఏర్పాటు చేశారు. ఇవి 1859 సెప్టెంబర్‌ 7 నుంచి పనిచేయడం మొదలు పెట్టాయి. దీని నిర్మాణానికి సుమారు 15 సంవత్సరాలు పట్టింది. బ్రిటన్‌ పార్లమెంటు భవనంలో భాగంగా ఉండే దీనికి సమీపంలోనే థేమ్స్‌ నది ప్రవహిస్తోంది. నది ఒడ్డున భూగర్భంలో మురుగు నీటి కాల్వల కోసం, కార్‌ పార్కింగ్‌ కోసం నిర్మాణాలు జరుగుతున్నాయి. దీని వల్లే బిగ్‌బెన్‌ దృఢమైన పునాదిని కోల్పోయి ఒక వైపుగా ఒరుగుతున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. ఇలా ఇది ఏడాదికి 0.04 అంగుళాల వంతున ఒరుగుతున్నట్టు అంచనా.

ప్రస్తుతం బ్రిటిష్‌ పార్లమెంటు భవనం ఉన్న స్థలంలో అంతకు ముందు వేరే భవంతి ఉండేది. అది 1834లో అగ్నిప్రమాదానికి గురవ్వడంతో కొత్త భవనాన్ని నిర్మించాలనుకున్నారు. అప్పుడే క్లాక్‌ టవర్‌ని కూడా కట్టాలని నిర్ణయించారు. అలా 1843లో నిర్మాణాన్ని ప్రారంభించారు. మరి దీనికి బిగ్‌బెన్‌ అని పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే, ఈ టవర్‌ లోపల గంటలు కొట్టే అయిదు పెద్ద గంటలు ఉంటాయి. వాటిలో అతి పెద్దదాని పేరే బిగ్‌బెన్‌. దీని బరువు 13.5 టన్నులు. అసలు దీని పేరు సెయింట్‌ స్టీఫెన్స్‌ టవర్‌ అనుకున్నా, బిగ్‌బెన్‌గానే పేరొందింది. టవర్‌కి నాలుగు వైపులా ఉండే గడియారాలు 25 అడుగుల వ్యాసంతో ఉంటాయి. వీటిలో ఉండే పెద్ద ముల్లులు 14 అడుగుల పొడవుగా, చిన్నముల్లులు 9 అడుగుల పొడవుగా ఉంటాయి.
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...